రిటైర్మెంట్ ఏజ్ పెంపుపై సింగరేణి కార్మికుల అసంతృప్తి

రిటైర్మెంట్ ఏజ్ పెంపుపై సింగరేణి కార్మికుల అసంతృప్తి

రిటైర్మెంట్  ఏజ్ 61కి  పెంచడంపై  అసంతృప్తి  వ్యక్తం  చేస్తున్నారు  సింగరేణి కార్మికులు.  డిపెండెంట్స్ ఉద్యోగం  పొందే అకాశం  కోల్పోయే  అవకాశం ఉందంటున్నారు.  రాజకీయ ప్రయోజనాల  కోసం  సింగరేణిని  సీఎం కేసీఆర్ వాడుకుంటున్నారని  విమర్శిస్తున్నారు. 

సింగరేణి ఉద్యోగులు, కార్మికులతో పాటు అన్ని విభాగాల అధికారుల వయోపరిమితి 60 నుంచి 61కి పెంచింది ప్రభుత్వం. జూలై 26న సింగరేణి బోర్డ్ డైరెక్టర్ల సమావేశంలో ప్రభుత్వ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. అయితే ఈ నిర్ణయానికి కోలిండియా డైరెక్టర్ తో పాటు కేంద్ర ప్రభుత్వ డైరెక్టర్లు ఆమోదం తెలుపుతూ సంతకాలు చేయాల్సి ఉందంటున్నారు కార్మిక సంఘాల నేతలు. అప్పటివరకు వయోపరిమితి పెంపు వర్తించదంటున్నారు. మార్చి నెల నుంచి వమోపరిమితి పెంపు వర్తింస్తుందని యాజమాన్యం చెప్పడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కార్మిక నేతలు. 

ఈ ఏడాది మార్చి నెల నుంచి పదవీవిరమణ పొందిన కార్మికులు తీసుకున్న సీఎంపీఎఫ్, గ్రాడ్యుటీ, పింఛన్ డబ్బులను తిరిగి చెల్లిస్తేనే ఉద్యోగాల్లోకి తీసుకుంటామని యాజమాన్యం నిబంధనలు పెట్టడం సరికాదంటున్నారు కార్మిక సంఘాల నేతలు. మార్చి నుంచి జూలై వరకు దిగిపోయిన కార్మికులలో కొంతమంది వివిధ కారణాలతో  చనిపోయారు. వాళ్ల పరిస్థితి ఎంటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. సిఎంపిఫ్ సంస్థ నిబంధనలలో వయోపరిమితి పెంపు లేదని కార్మిక సంఘాలంటున్నాయి.
 
వయస్సు పెంపుతో తమ పిల్లలకు డిపెండెంట్ ఉద్యోగాలు రావని కార్మికులు భయపడుతున్నారు. డిపెండెంట్ల ఏజ్ లిమిట్ ఇప్పటివరకు 35 ఏళ్లు వుంది. కార్మికుని వయస్సు పెరగడం వల్ల డిపెండెంట్ వయస్సు కూడా పెరుగుతుంది. దీంతో డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ ని కార్మికుని వారసులు కోల్పోనున్నారు. తండ్రికి 60 వుండి వారసుడికి 35 వున్నప్పుడు అర్హత ఉంటుంది. తండ్రికి 61 పెరగడం వల్ల వారసునికి 36 ఏళ్లు వస్తాయి. దీంతో డిపెండెంట్ ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఉంటుంది.కార్మికుల వయోపరిమితి  ఏడాది పెంచినట్లుగానే డిపెండెంట్ల వయస్సు కుడా 35 నుంచి మరో మూడు లేదా అయిదు సంవత్సరాలు పెంచాలంటున్నారు కార్మిక నేతలు. సింగరేణిని కేసీఆర్ సొంత బ్యాంక్ ఖాతా బుక్ గా మార్చుకొని సంస్థ డబ్బును వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. పెద్దపల్లి,కరీంనగర్,జమ్మికుంట,హుజురాబాద్, కమలాపూర్  ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఎక్కువగా సింగరేణిలో ఉద్యోగాలు చేస్తున్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో గెలుపుకోసం సీఎం కేసీఆర్ సింగరేణిలో వయోపరిమితి పెంపు నిర్ణయం తీసుకున్నారని కార్మికుల్లో చర్చ జరుగుతోంది.