రాష్ట్రమంతటా నైరుతి పవనాలు.. మరో రెండు రోజులు వర్షాలు

రాష్ట్రమంతటా నైరుతి పవనాలు.. మరో రెండు రోజులు వర్షాలు
  • జూబ్లీహిల్స్​లో అత్యధికంగా 6.5 సెం.మీ. వర్షపాతం 
  • మరో రెండ్రోజులు వానలు పడే అవకాశం
  • పలు జిల్లాల్లో వానలు.. 
  • భారీగా తగ్గిన టెంపరేచర్లు

హైదరాబాద్, వెలుగు: నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. జూన్10వ తేదీనే రాష్ట్రంలోకి రావాల్సిన రుతుపవనాలు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రెండు వారాలు ఆలస్యంగా ఈ నెల 22న ఖమ్మంలోకి ఎంటరయ్యాయి. శుక్రవారం మరికొన్ని ప్రాంతాలకు వ్యాపించిన రుతుపవనాలు.. శనివారం రాష్ట్రం మొత్తం విస్తరించాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. మేడ్చల్ మల్కాజిగిరిలో మాత్రం అత్యధికంగా 40.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది.  యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వర్షం పడింది. అత్యధికంగా సిద్దిపేట జిల్లా రాంపూర్​లో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 4.8, మెదక్ జిల్లా నర్సాపూర్​లో 4.1, సిద్దిపేట జిల్లా ముస్త్యాల, కొమురవెల్లిలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, దాని ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

హైదరాబాద్​లో భారీ వర్షం

హైదరాబాద్​లో భారీ వర్షం పడింది. శనివారం రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు కుండపోత వాన కురిసింది. రోడ్లపైకి వరద చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. అత్యధికంగా జూబ్లీహిల్స్ లో 6.5 సెంటీమీటర్ల వర్షం పడింది. ఫిల్మ్ నగర్ లో 5.5, గచ్చిబౌలిలో 5.1, శేరిలింగంపల్లిలో 5, షేక్ పేటలో 4.6, రాజేంద్రనగర్ లో 4, యూసుఫ్ గూడలో 3.9, శ్రీనగర్ కాలనీలో 3.7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లా పరిగిలోనూ మోస్తరు వాన కురిసింది. వర్షాల నేపథ్యంలో డీఆర్ఎఫ్, ఇంజనీరింగ్ అధికారులు అలర్ట్ గా ఉండాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు. కాగా, మరో రెండ్రోజుల పాటు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.