ప్రధానమంత్రి ఫసల్‌‌ బీమాపథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం

ప్రధానమంత్రి ఫసల్‌‌ బీమాపథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం
  • రెండేండ్లలో నిలిచిపోయిన రూ.960కోట్ల క్లెయిమ్స్
  • పరిహారం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న రైతులు 
  •  రైతులకు శాపంగా మారుతోంది

రెండేండ్లుగా రాష్ట్ర సర్కార్​ తన వాటా చెల్లించకపోవడంతో పంట నష్టపోయిన రైతులకు అందాల్సిన రూ. 960 కోట్ల పరిహారం విడుదల కాలేదు. దీంతో రైతులు పరిహారం కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. 2018–19 సంబంధించి మొత్తం బీమా ప్రీమియం రూ.389 కోట్లు కాగా, అందులో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా రూ.194.50 కోట్లు. 2019–20 సంబంధించి మొత్తం బీమా ప్రీమియం రూ.638 కోట్లు కాగా, అందులో రాష్ట్ర ప్రభుత్వ చెల్లించాల్సిన వాటా రూ.319 కోట్లు. ఈ రెండేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన తన వాటా మొత్తం రూ. 413.50 కోట్లు ఇప్పటివరకూ చెల్లించలేదు.

2017 యాసంగి నుంచే ఆగం

పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ప్రారంభించింది. దీని కింద ఏటా వానాకాలం, యాసంగి పంటలకు సంబంధి రైతుల వాటా, రాష్ట్ర ప్రభుత్వం వాటా, కేంద్రం ప్రభుత్వం వాటాగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించిన సొమ్ము నుంచి బీమా కంపెనీలు పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తాయి. పథకం ప్రారంభమైన మొదటి రెండేండ్లు రాష్ట్రంలో సాఫీగానే అమలైంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా చెల్లిస్తేనే కేంద్ర ప్రభుత్వం వాటాను చెల్లిస్తుంటుంది. రైతులు తమ వాటా చెల్లిస్తూ ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2017 యాసంగి నుంచి వాటా చెల్లించడం మానేసింది. ఆ యాసంగిలో మొత్తం బీమా ప్రీమియం రూ. 60 కోట్లు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ. 17 కోట్లు చెల్లించాల్సి ఉండగా చెల్లించలేదు. దీంతో కేంద్రం కూడా తన వాటా చెల్లించలేదు. ఫలితంగా ఆ యాసంగిలో పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని బీమా కంపెనీలు విడుదల చేయలేదు. ఆ పరిహారం కోసం ఇప్పటికీ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌‌ మండలానికి చెందిన రైతులు వ్యవసాయశాఖ కమిషనరేట్‌‌ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

2018–19లో ఇదీ పరిస్థితి

2018–19 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి రాష్ట్రంలో 7.94 లక్షల మంది రైతులు పంట బీమా ప్రీమియం చెల్లించారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా కింద రూ. 389కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా రూ. 194.50 కోట్లు చెల్లించలేదు. దీంతో కేంద్రం కూడా వాటా చెల్లింపులు ఇవ్వలేదు. ఫలితంగా 2018–19 రెండు సీజన్లలో కలిపి రూ. 410 కోట్లు రైతులకు పరిహారంగా అందాల్సి  డబ్బు రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడంతో ఆగిపోయింది.

2019–20లో ఇదీ పరిస్థితి

2019–20 వానకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి రాష్ట్రంలో 10.15 లక్షల మంది రైతులు పంట బీమా ప్రీమియం చెల్లించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా కింద రూ.638 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే రాష్ట్రం తన వాటా రూ. 319 కోట్లు చెల్లించలేదు. దీంతో రైతులకు 2019–20 లో రావాల్సిన రూ. 550 కోట్ల పరిహారం బీమా కంపెనీలు విడుదల చేయడం లేదు.

ఇకనుంచి బీమా చెల్లించడం రైతుల ఇష్టమే

రైతులకు బ్యాంకుల్లో రుణాలు తీసుకునేప్పుడే పంట బీమా ప్రీమియం కట్‌‌ చేసుకొని రుణాలు ఇస్తుంటారు.   కొందరు రైతులు ఈ–సేవా సెంటర్లలో ఫసల్‌‌ బీమా నమోదు చేసుకుంటుంటారు.  ఈ ఏడాది నుంచి రుణాల టైంలో బీమా కట్​ చేయడం మానేశాయి. రైతుల ఇష్టానికి వదిలేశాయి.  రైతులు అనుమతిస్తేనే బ్యాంకులు బీమా ప్రీమియం కట్‌‌ చేస్తున్నాయి.