సెక్రటేరియట్ ముట్టడికి టీచర్ల పిలుపు

సెక్రటేరియట్ ముట్టడికి టీచర్ల పిలుపు

హైదరాబాద్, వెలుగు: టీచర్ల అలాట్​మెంట్​లో స్థానికతను పట్టించుకోలేదని ఆరోపిస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్​పీసీ) మంగళవారం సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చింది. జీవో నంబర్ 317తో నష్టపోయిన టీచర్లకు న్యాయం చేయాలని డిమాండ్  చేసింది. యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ మీటింగ్ ఆదివారం వర్చువల్​గా జరిగింది. టీచర్ల సంఘాలతో చర్చించకుండానే 317 జీవో విడుదల చేయడాన్ని నేతలు తప్పుపట్టారు. స్థానికత ప్రస్తావన జీవోలో లేకపోవడం, వేరే జిల్లాలో స్థానికేతరులుగా శాశ్వతంగా పనిచేయాల్సి రావడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి జరిపిన మీటింగ్​లో ఒక్క సంఘం మినహా మిగిలిన సంఘాలన్నీ ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని గుర్తుచేశారు. మెజార్టీ అభిప్రాయాన్ని పక్కనపెట్టి ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం దుర్మర్గమన్నారు.

సీఎస్ సోమేశ్​ కుమార్ ఇటీవల రంగారెడ్డిలో ఇచ్చిన హామీ మేరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టు జోనల్ కేడర్​గా మార్చాలని, పరస్పర బదిలీలకు అవకాశమివ్వాలని కోరారు. 28న నిర్వహించే సెక్రటేరియట్ ముట్టడికి టీచర్లు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో యూఎస్పీఎసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు జంగయ్య, చావ రవి (యూటీఎఫ్), మైస శ్రీనివాసులు (టీపీటీఎఫ్), రఘుశంకర్ రెడ్డి, టీ.లింగారెడ్డి(డీటీఎఫ్), యూ.పోచయ్య, డీ.సైదులు (ఎస్టీఎఫ్), షౌకత్ అలీ, ఎన్ చెన్నరాములు(టీఎస్పీటీఏ), జాడి రాజన్న (ఎస్సీఎస్టీటీఏ), ఎన్.యాదగిరి (బీటీఎఫ్), గంగాధర్(టీపీఎస్ హెచ్ఎంఏ), ఎస్. హరికృష్ణ (టీటీఏ), చింతా రమేష్ (టీఎస్ ఎస్సీఎస్టీయూఎస్), టీ.విజయ సాగర్ (టీజీపీఈటీఏ), బీ.కొండయ్య, ఎస్.మహేష్(ఎంఎస్టీఎఫ్), తాహెర్ (ఏపీయూటీఏ) పాల్గొన్నారు.