ఫ్రొఫెసర్ల రిటైర్మెంట్​తో తెలుగు వర్సిటీకి ఇబ్బందులు

ఫ్రొఫెసర్ల రిటైర్మెంట్​తో తెలుగు వర్సిటీకి ఇబ్బందులు
  •     పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేష్ 

హైదరాబాద్, వెలుగు: రెగ్యులర్ ప్రొఫెసర్ల రిటైర్మెంట్​తో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయనీ వర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేష్ అన్నారు. బుధవారం నాంపల్లిలోని వర్సిటీ ఆడిటోరియంలో ప్రొఫెసర్ చల్లా మురళీకృష్ణ రిటైర్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 1992లో అసిస్టెంట్ లైబ్రరియన్​గా ఉద్యోగంలో చేరిన మురళీకృష్ణ.. అసోసియేట్ ప్రొఫెసర్​గా, ప్రొఫెసర్​గా సేవలందించారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో ప్రొఫెసర్ భట్టు రమేష్ మాట్లాడుతూ... ‘మురళీకృష్ణ , నేనూ ఒకేరోజూ వర్సిటీలో ఉద్యోగంలో చేరాం. ఆయనకు ఏ బాధ్యత ఇచ్చినా నిబద్ధతతో పనిచేశారు. వర్సిటీలో సిబ్బంది కొరతతో లైబ్రరియన్ అధికారిగా ఉన్న ఆయనను, దూర విద్యాకేంద్రం డైరెక్టర్​గా, ఎగ్జామినేషన్ కంట్రోలర్​గా బాధ్యతలు ఇచ్చాం.

వీటితో పాటు ఐదు డిపార్ట్​మెంట్లకు హెచ్ వోడీగా, సామాజిక తదితర శాస్ర్తాల విభాగానికి డీన్​గా,  వర్సిటీ  ఇన్​చార్జి రిజిస్ట్రార్ గానూ మురళీకృష్ణ బాధ్యతలు నిర్వహించారు’ అని గుర్తుచేశారు. పలు కొత్త కోర్సులు తీసుకురావడంతో ఆయన పాత్ర ఉందని చెప్పారు. ఉద్యోగ విరమణ పొందినా ఆయన సేవలను వర్సిటీకి ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు భట్టు రమేశ్ స్పష్టం చేశారు. ఎగ్జామినేషన్ కంట్రోలర్​గా బాధ్యతలు స్వీకరించిన కోట్ల హనుమంత రావు మాట్లాడుతూ..మలేషియాలో  తెలుగు సంఘం నిర్వహించే పరీక్షల నిర్వహణలో మురళీకృష్ణ కృషి  ఎంతో ఉందన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు సత్తిరెడ్డి, సుధీర్ కుమార్, చెన్నారెడ్డి, గాబ్రియల్, నిరీక్షణ బాబు, వెంకటేశం, శ్రీనివాసచారి, లింగయ్య,వెంకటరమణ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. టీచింగ్, నాన్ టీచింగ్ అసోసియేషన్లు, నాల్గో తరగతి సిబ్బంది యూనియన్ మురళీకృష్ణను సత్కరించారు.