అమెరికా సురసుర!

అమెరికా సురసుర!
  • 40 డిగ్రీలు దాటేసిన టెంపరేచర్లు

అమెరికా అల్లాడిపోతోంది. ఎండ మంటకు మండిపోతోంది. ఇప్పటికే టెంపరేచర్లు 40 డిగ్రీలను దాటేశాయి. సగటున 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాత్రిపూట కూడా వేడి తగ్గని పరిస్థితి ఉంది. బాల్టిమోర్​లో ఎక్కువగా 50 డిగ్రీలను తాకింది. మండే ఎండల వల్ల  20 కోట్ల మందికి ఇబ్బందులు తప్పవని  అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆరుగురు చనిపోయారు. మేరీలాండ్​లో నలుగురు, అరిజోనా, ఆర్కాన్సస్​లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు వదిలారు. ఈ వేడి మరికొన్ని రోజులు అలాగే కొనసాగే పరిస్థితులున్నాయని అమెరికా వాతావరణ సంస్థ నేషనల్​ వెదర్​ సర్వీస్​ హెచ్చరించింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా జనాన్ని చల్లబరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కూలింగ్​ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇటు చాలా కార్యక్రమాలు, ఆటలు వాయిదా పడ్డాయి. కొన్ని కంపెనీలు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించాయి. చాలా నగరాల్లో వాతావరణ ఎమర్జెన్సీని ప్రకటించారు.

66 శాతం ప్రాంతాల్లో అదే పరిస్థితి

ఇక్కడా, అక్కడా అన్న తేడా లేకుండా దేశంలో 66 శాతం ప్రాంతాల పరిస్థితి ఇప్పుడు పొయ్యిలో పడ్డట్టయింది. కొలరాడో, కాన్సస్​లోని సెంట్రల్​ ప్లెయిన్స్​ నుంచి ఈశాన్య ప్రాంతంలోని గ్రేట్​ లేక్స్​ వరకు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇటు ఆర్కిటిక్​ సర్కిల్​లోనూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. న్యూయార్క్​, వాషింగ్టన్​, బోస్టన్​, షికాగో, ఈస్ట్​కోస్ట్​, మిడ్​వెస్ట్​ ప్రాంతాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు న్యూయార్క్​లో 500 కూలింగ్​ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు నగర మేయర్​ ప్రకటించారు. డెట్రాయిట్​ సహా మిగతా నగరాల్లోనూ ఇలాంటి చర్యలే చేపట్టారు. ఇటు అమెరికాకు పక్కనే ఉండే కెనడాలోనూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. క్యుబెక్​, ఒంటారియో, నోవా స్కోషియా, టొరంటో వంటి నగరాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటాయి. మోంట్రియల్​లో అయితే దాదాపు 45 డిగ్రీలు నమోదైనట్టు కెనడా వాతావరణ నిపుణులు హెచ్చరించారు. మున్ముందు కూడా అదే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

కరెంట్​ కట్​

చాలా చోట్ల కరెంట్​ కష్టాలు నెత్తిమీదికెక్కి కూర్చున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండ వేడి వల్ల సబ్​స్టేషన్లలో కరెంట్​ ట్రిప్​ అవుతోంది. దీంతో గంటల కొద్దీ కరెంట్​ కోతలు వేధిస్తున్నాయి. విస్కాన్సిన్​, మాడిసన్​లలో పరిస్థితి తీవ్రంగా ఉంది. మాడిసన్​లో అయితే వేడి ధాటికి సబ్​స్టేషన్​ తగలబడిపోయింది. ఫాక్స్​ వ్యాలీ, విస్కాన్సిన్​ పబ్లిక్​ సర్వీస్​ నెట్​వర్క్​ కస్టమర్లకు కొన్ని రోజుల పాటు ఈ కరెంట్​ కష్టాలు తప్పవని సెనేటర్​ రోజర్​ రోథ్​ తెలిపారు. సబ్​స్టేషన్​ తీవ్రంగా ధ్వంసమైందని చెప్పారు. న్యూయార్క్​ నగరంలోనూ కరెంట్​ బాధలు వేధిస్తున్నాయి. ఫార్​ రాక్​ అవే, క్వీన్స్​, లాంగ్​ ఐలాండ్​లో 9 వేల మంది ఇళ్లకు కరెంట్​ ఇవ్వలేని పరిస్థితి ఉందని కరెంట్​ కంపెనీ పీఎస్​ఈజీ లాంగ్​ ఐలాండ్​ వెల్లడించింది. పలు రైలు సర్వీసులూ రద్దయ్యాయి.

అపోలో 11 ఫెస్ట్​కు ధైర్యం చేశారు

చంద్రుడిమీద కాలుమోపి 50 ఏళ్లు అయిన సందర్భంగా వాషింగ్టన్​లో అపోలో 11 ఫెస్ట్​ను నిర్వహించారు. అయితే, ఎండనూ లెక్క చేయకుండా చాలా మంది ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అందుకు నిర్వాహకులు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. వైద్య సిబ్బందిని అక్కడ నియమించారు. ఇటు, న్యూయార్క్​లో ఏటా నిర్వహించే సెంట్రల్ పార్క్​ ఫెస్టివల్​ ఓజీ ఫెస్ట్​నూ ఎండ ధాటికి రద్దు చేశారు. బేస్​బాల్​ టోర్నమెంట్​ను కాన్సిల్​ చేశారు. న్యూయార్క్​ జైలులో ఖైదీలకు ఎండ నుంచి రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టారు. ఎండాకాలంలో వేసుకునే ప్రత్యేక బట్టలు అందించారు. క్లినిక్​లు, వైద్య సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

1936 నాటి పరిస్థితి

ఇంతటి వేడికి కారణం వాతావరణ మార్పులేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలుష్యం కొనసాగితే 2100 నాటికి ప్రతి నలుగురిలో ముగ్గురిపై ఎండ వేడి ప్రభావం పడుతుందని రెడ్​ క్రాస్​ రెడ్​ క్రెసెంట్​ క్లైమేట్​ సెంటర్​ హెచ్చరించింది. ఇప్పుడు అమెరికా చరిత్రలో గడ్డు రోజులుగా చెప్పుకునే 1936 నాటి వాతావరణ పరిస్థితులు ఏర్పడే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ ఏడాది కూడా టెంపరేచర్లు ఇలాగే పెరిగిపోయాయి. దాదాపు 5 వేల మంది దాకా చనిపోయారు. పంటలు నాశనమయ్యాయి.
2012లో హీట్​ వేవ్​ ఏర్పడే దాకా 1936లో నమోదైన టెంపరేచర్లదే రికార్డు. ఇక, 1995 జులైలో మూడు రోజుల వ్యవధిలో ఎండ వేడికి 700 మంది దాకా చనిపోయారు.

నేరాలు చెయ్యకండ్రా బాబు.. ఇంట్లోనే ఆడుకోండి

ఈ ముచ్చట ఇట్లుంటే, పోలీసులు ఇంకో ముచ్చట చెప్పారు. ఎవరూ నేరాలకు పాల్పడొద్దని, బయట చచ్చేంత ఎండ ఉందని వాషింగ్టన్​ పోలీసులు హెచ్చరించారు. ‘‘వేడి ఎక్కువగా ఉన్నందున ఎవరూ నేరాలు చేయొద్దని జనానికి సూచిస్తున్నాం. ఇంట్లోనే ఉండి పనులు చూసుకోండి. ఇంత వేడిలో నేరాలకు పాల్పడితే అది మీ ప్రాణాలకే మీదకే తేవొచ్చు. ఇంట్లో ఉండండి. ఏసీలు వేసుకోండి. స్ట్రేంజర్​ థింగ్​ సీజన్​ 3 చూస్తూ ఎంజాయ్​ చేయండి. ఫేస్​యాప్​తో ఆడుకోండి. కరాటే చేయండి” అంటూ బ్రెయిన్​ ట్రీ పోలీసులు ట్వీట్​ చేశారు. ఎండ వేడి నుంచి పిల్లలను కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చల్లగా ఉండేలా ఇంటి పైకప్పులను కూలింగ్​ పెయింట్లతో పెయింట్​ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎండకు పెట్టిన కార్లలో కేవలం 8 నిమిషాల్లోనే 52 డిగ్రీల వేడి పుడుతుందని, జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.  జంతువులనూ జాగ్రత్తగా చూసుకోవాలంటున్నారు.