కమ్యూనిటీలోకి కరోనా: వచ్చే నాలుగైదు వారాలు జాగ్రత్తగా ఉండాలి

కమ్యూనిటీలోకి కరోనా: వచ్చే నాలుగైదు వారాలు జాగ్రత్తగా ఉండాలి

ఎర్లీ ఐడెంటిఫికేషన్..ఎర్లీ ట్రీట్ మెంటే మార్గం
వచ్చే నాలుగైదు వారాలు జాగ్రత్తగా ఉండాలి
లక్షణాలుంటేనే టెస్టులకు రండి
కరోనా ట్రీట్ మెంట్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాల్సిన అవసరం లేదు
పీహెచ్సీల్లోనూ టెస్టులకు ఏర్పాట్లు 70 % మంది పేషెంట్లు హోం
ఐసోలేషన్ లోనే ఉన్నారని వెల్లడి
వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం,
మహబూబ్ న‌గర్ జిల్లా కేంద్రాల్లో ఎక్కువ ప్రమాదం
పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్ కమ్యూనిటీలోకి పోయిందని, అది ఎక్కడ ఉంది.. ఎలా ఉంది అనేది మనకు కనిపించదని రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. వచ్చే నాలుగైదు వారాలు చాలా కష్టకాలమని, ప్రధానంగా ఉమ్మడి జిల్లా కేంద్రాలైన వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ లో కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బయటికి వెళ్లేట‌ప్పుడు తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవాలని, ఆరడుగుల దూరాన్ని పాటించాలని, చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. హైదరాబాద్ కోఠిలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఆయన డీఎంఈతో కలిసి గురువారం మీడియాతో మాట్లాడారు. కరోనా సోకిందని భయపడొద్దని, ఈ భయమే ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తుందని చెప్పారు. కరోనా లక్షణాలు ఉంటేనే టెస్టులకు రావాలని, లక్షణాలు లేకుంటే టెస్టులు అవసరం లేదని స్పష్టం చేశారు. జలుబు, దగ్గు, జ్వరాన్ని నిర్ల‌క్ష్యం చేయొద్దని హెచ్చరించారు. ఎర్లీ ఐడెంటీఫికేషన్.. ఎర్లీ ట్రీట్ మెంటే మన ముందున్నమార్గమన్నారు. రాష్ట్రంలో కరోనా బాధితుల్లో 99 శాతం మందికిపైగా క్యూర్ అవుతున్నారని, 0.88 శాతం మంది మాత్రమే మరణిస్తున్నారని చెప్పారు. 70 శాతం మంది పేషెంట్లు హోం ఐసోలేషన్లో ఉన్నారని, 30 శాతం మంది మాత్రమే హాస్పిటళ్ల‌లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని వివరించారు. ఇప్పటి వరకు మిలియన్ జనాభాకు 8,321 టెస్టులు చేసినట్లు ఆయన చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే 104కు కాల్ చేయొచ్చన్నారు.

ప్రైవేటులోని ఫీజులపై ఫిర్యాదులు వస్తున్నయ్

ప్రైవేట్ హాస్పిటళ్ల‌పై ఫిర్యాదుల కోసం కేటాయించిన వాట్సప్ నంబర్ (915417 0 960)కు ఫిర్యాదులు వస్తున్నాయని పబ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాసరావు చెప్పారు. ఇందులో ఎక్కువగా వసూలు చేసే ఫీజులు, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని  యాక్సెప్ట్ చేయకపోవడం, ఎక్కువగా డబ్బులు డిపాజిట్ చేయించుకోవడం వంటి అంశాలపై ఫిర్యాదులు ఉంటున్నాయని వివరించారు. రోజుకు 15 వేల టెస్టులు చేస్తున్నామని, ఇప్పటికే 2లక్షల యాంటీ జెన్ టెస్టు కిట్స్ తెప్పించామని, ఇవి అయిపోవడానికి వస్తుండడంతో మరో 2 లక్షలు తెప్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

ఆరోగ్యశ్రీలో చేర్చాల్సిన అవసరం లేదు

జీహెచ్ఎంసీ పరిధిలో 290 కేంద్రాల్లో టెస్టులు చేస్తున్నామని, రాష్ట్రంలోని పీహెచ్సీల్లో టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో 20 వేల నుంచి 25 వేల వరకు టెస్టులు పెంచుతామన్నారు. లక్షణాలు ఉన్నవారికి, కరోనా పాజిటివ్ వచ్చినవారి క్లోజ్ కాంటాక్ట్స్ కు మాత్రమే టెస్టులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 49 వేల పాజిటివ్ కేసులు నమోదైతే.. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో దాదాపుగా వెయ్యి మందికి పైగా వైరస్ బారిన పడినట్లు ఆయన చెప్పారు. తమ శాఖతో పాటు పోలీస్, జీహెచ్ఎంసీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారని పేర్కొన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో 15 వేలకు పైగా బెడ్స్ అందుబాటులో ఉన్నాయని, డబ్బులు వృథా చేసుకోకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చాల్సిన అవసరం లేదన్నారు.

కోర్టులో రోజుకో పిల్ వేయడం సరికాదు: డీఎంఈ

కరోనాపై పోరు సాగిస్తున్న హెల్త్ స్టాఫ్ చాలా ఒత్తిడికి గురవుతున్నారని డీఎంఈ రమేశ్ రెడ్డి అన్నారు. మెడికల్ ప్రొఫెషన్స్ ధైర్యంగా విధులు నిర్వర్తిస్తున్నారని, హెల్త్ స్టాఫ్ కు అందరూ మద్దతుగా నిలబడాలని ఆయన కోరారు. కోర్టులో రోజుకో పిల్ వేయడం మంచి పరిణామం కాదని తప్పు బట్టారు. యాంటీ బయాటిక్ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అన్ని కలిపి అయ్యే ఖర్చు రూ.150 మాత్రమేనని, సకాలంలో ట్రీట్మెంట్ అందితే లక్షల రూపాయలు అవసరం లేదని ఆయన అన్నారు. ప్రైవేటు హాస్పిటల్‌‌‌‌లో లక్షల రూపాయలు ఎందుకు చార్జ్ చేస్తున్నారని ప్రశ్నిం చారు. ప్రభుత్వమే అన్ని సదుపాయాలు కల్పిస్తుందని, అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉంచుతున్నామని ఆయన పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం