సిద్ధాంతమే ఆస్తి పాస్తులు..పేదరికమే వారసత్వం

సిద్ధాంతమే ఆస్తి పాస్తులు..పేదరికమే వారసత్వం

కోనరావుపేట, వెలుగు : సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటకి చెందిన కర్రోల్ల నర్సయ్య..1940 దశకంలో వ్యవసాయ కూలీగా పని చేసిండు. కమ్యూనిజానికి ఆకర్షితుడై పార్టీలో చేరిండు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఊళ్లు తిరిగేటోడు. పాటలు పాడేటోడు. యువకులను చైతన్యపర్చెటోడు. గడిల పాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని నడిపిండు. అమృత్​లాల్​శుక్లా శిష్యరికంలో రాటుదేలి రజాకార్లకు చుక్కలు చూపిండు. సాయుధ పోరులో ముందుకురికుండు. బద్దం ఎల్లారెడ్డి, చెన్నమనేని రాజేశ్వరావు, అమృతలాల్ శుక్లా వంటి వ్యక్తులతో కలిసి పని చేసిండు. కోనరావుపేట మండలం నిమ్మపల్లి లో జరిగిన భూపోరాటంలో  భూస్వాములను ఎదిరించి 100 ఎకరాల భూమిని దళితులకు ఇప్పించిండు. 1957 లో సిరిసిల్ల ద్విసభ్య నియోజకవర్గంలో నేరెళ్ళ నియోజకవర్గం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యేగా గెలిచిండు. దీంతో కమ్యూనిస్టు అనేదే ఇంటి పేరుగా స్థిరపడి కమ్యూనిస్టు నర్సయ్య అయ్యిండు.  అంత్యంత సాదాసీదా రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నడు.

ఎమ్మెల్యే అయినా..

నర్సయ్య ఎమ్మెల్యే అయినా అధికార దర్పాన్ని చూపలేదు. కుటుంబంతో గడిపిందీ తక్కువే. ఆ తర్వాత వచ్చిన మార్పులతో రాజకీయాల నుంచి కాస్త దూరం జరిగారు. అయినా ఊళ్లు తిరగడం మానలేదు. జనాల సమస్యలు తెలుసుకోవడం, పరిష్కారానికి పోరాడడం ఇదే పని. దీని కోసమే జీవితాంతం కష్టపడిండు. వృద్ధాప్యంలోనూ పేదరికంలోనే గడిపిండు. 2003 దాకా పింఛన్​ డబ్బులతోనే బతికిండు. ఆయన తర్వాత కూడా కుటుంబం పేదరికంతో కొట్టుమిట్టాడింది.  ఫించన్ కూడా సరిగ్గా రాకపోయేసరికి భార్య దుర్గమ్మ వరి కల్లాలను ఊడ్చి, కూలీ పనులు చేసేది.  ఆమె కూడా రెండేండ్ల క్రితం చనిపోయారు.

తండ్రి పేరుకు మచ్చ తేవొద్దని...

సర్పంచ్..వార్డు మెంబర్​అయితేనే లక్షలు సంపాదించుకుందామనే ఆలోచన ఉంటది కొంతమందిలో . చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకున్నట్టు లీడర్లయిన తండ్రుల పేర్లు చెప్పి కమాయించుకునే కొడుకుల సంఖ్య కూడా ఇప్పుడేం తక్కువ లేదు. కానీ కర్రోళ్ల నర్సయ్య కొడుకులు అట్లాంటోళ్లు కాదు. ఏ ఒక్కరూ రాజకీయాల్లో సెటిల్ కాలేదు. తమ తండ్రి ఎమ్మెల్యేగా పని చేశాడని, తాము ఇబ్బందుల్లో ఉన్నామని ఎవ్వరికీ చెప్పుకోలేదు. ఆస్తిపాస్తులేవి సంపాదించి ఇవ్వకున్నా తండ్రి పేరుకు మచ్చతేవొద్దనుకుని ఉన్నంతల బతికిన్రు. పెద్ద కొడుకు ప్రభాకర్​..కూలీ పని చేసుకుని బతికిండు. 30 ఏండ్ల క్రితమే అనారోగ్యంతో చనిపోయిండు. మూడో కొడుకు ఆనందం మల్కపేటలో చిన్న రేకుల షెడ్డులో ఉంటూ సుతారి పని చేసేటోడు. కడుపులో కణతులు కావడంతో పని చేసిందంతా మందులు, ట్రీట్​మెంట్​కే ఖర్చు చేసేటోడు. ఇది సరిపోక బయట మూడు లక్షల వరకు అప్పు చేసిండు. సర్జరీ చేయించుకున్నా నయం కాలే. కార్పొరేట్​ దవాఖానాల్లో చూయించుకోనికి పైసల్లేక మంగళవారం ప్రాణాలు వదిలిండు. ఇతడికి భార్య వనిత, కొడుకులు లెనిన్, మధు కూతురు కార్తీక ఉన్నారు. ఇక రెండో కొడుకు భాస్కర్​సిరిసిల్లలో ఏదో చిన్న పని చేసుకుంటున్నాడు.

 సంపాదించుకోవాలనే ఆలోచన లేనోడు

కర్రోల్ల నర్సన్న కొన్నేండ్లు వ్యవసాయ కూలీగా పని చేసిండు. నడుసుకుంటనే ఊళ్లన్నీ తిరిగెటోడు. కమ్యూనిస్ట్ పార్టీల చేరి అమృతలాల్ శుక్లా దగ్గర పని చేసిండు. ఎమ్మెల్యేగా గెలిచిండు. అప్పటి దొరల పాలనకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు. యువకులకు ధైర్యం మాటలు చెప్పెటోడు.  మంచి మంచి పాటలు పాడేటోడు. అప్పటి నుంచి అంతే. సంపాదించుకుందామనే ఆలోచన లేనోడు. ఆళ్ల ముగ్గురు కొడుకులు కూడా పేదరికంలోనే బతికిన్రు. ఆపరేషన్​కు పైసల్లేక మూడో కొడుకు గూడ సచ్చిపోయిండు.

– నాగసముద్రం నర్సయ్య, మల్కపేట

ఏనాడు నోరిడిసి అడగలే

నా చిన్నతనంలో మా నాన్న ఎమ్మెల్యే గా పని చేసిండు. ఎప్పుడూ సంపాదన గురించి ఆలోచించలే. మమ్మల్ని గూడ అట్లనే పెంచిండు. జనం ..జనం అనేటోడు. ఊర్లు తిరిగేటోడు. మార్క్స్​, ఏంగిల్స్​, లెనిన్​ గురించి చెప్పెటోడు. రైతాంగ పోరాటం, రజాకార్లపై పోరాటం చేసిండు. సమ సమాజం ఏర్పడాలె అనేటోడు. పెద్ద, పేద తేడాలుండొద్దని చెప్పెటోడు. అటువంటి మనిషిని మళ్లీ ఇప్పటివరకు సూడలే. మా అమ్మ కూలీ పని చేసి మమ్మల్ని సాకింది. మేము కూడా ఆయన ఆశయాలను కొనసాగించాలని అనుకున్నం. అందుకే ఎవ్వల్నీ నోరిడిసి ఇది కావాలె అని అడగలే.

– భాస్కర్, కర్రోల్ల  నర్సయ్య కొడుకు