పత్తి, మిర్చి..అడ్డికి పావుసేరు : వ్యాపారులు చెప్పిందే క్వాలిటీ.. పెట్టిందే ధర

పత్తి, మిర్చి..అడ్డికి పావుసేరు : వ్యాపారులు చెప్పిందే క్వాలిటీ.. పెట్టిందే ధర

వ్యాపారులు చెప్పిందే క్వాలిటీ.. పెట్టిందే ధర
నెల రోజుల్లో భారీగా తగ్గిన మిర్చి ధర
ఒక్కసారిగా రూ.2 వేలు తగ్గిన పత్తి
చేసిన కష్టం, పెట్టుబడి కూడా ఎల్తలేదంటున్న రైతులు

వరంగల్, పెద్దపల్లి, వెలుగు: పత్తి , మిర్చి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. సీజన్​ స్టార్టింగ్​లో 20 వేలకు పైగా పలికిన మిర్చి రేటు ఏకంగా ఆరేడు వేలు తగ్గింది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మొన్నటి వరకు క్వింటాల్ ధర రూ. 6వేలు పలికిన పత్తి సోమవారం ఒక్కసారి రూ.4 వేలకు పతనమైంది. సిండికేట్​గా మారిన వ్యాపారులు క్వాలిటీ పేరు చెప్పి ఇష్టం వచ్చినట్టు రేటు తగ్గిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్​లో డిమాండ్ లేదని ప్రచారం చేస్తూ.. రైతులను భయపెడుతూ తక్కువ ధరకే కొంటున్నరు. రాష్ట్ర సర్కార్, మార్కెట్​ పాలక వర్గాలు ఇవేవి పట్టిచుకోకపోవడంతో వ్యాపారులు ఇష్టమొచ్చినట్లు రేట్లు నిర్ణయిస్తున్నరు. దీంతో రైతులకు చేసిన కష్టం, పెట్టుబడి కూడా ఎల్తలేదు.  కొద్ది రోజుల్లోనే ధరలు భారీగా తగ్గడం, ఇంకా తగ్గుతుందనే ప్రచారంతో రైతులు ఆందోళన చెందుతున్నరు.

ఫిబ్రవరి 26న ట్రేడ్ యూనియన్ల భారత్​ బంద్, 27, 28 శని, ఆదివారాలు కావడంతో వరంగల్​ ఎనుమాముల మార్కెట్లో మూడు రోజులు కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో సోమ, మంగళవారాల్లో దాదాపు 40 వేల బస్తాల మిర్చి మార్కెట్​కు వచ్చింది. జనవరి చివరలో వండర్ హాట్ రకం రూ.20,500 వరకు ధర పలికింది. అదే సమయంలో దీపిక రూ.20వేలు, యూఎస్–341 రకానికి రూ.18వేల వరకు ధర దక్కింది. ఆ తర్వాత మిర్చి రేటు క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. మార్కెట్​లో కొందరు వ్యాపారులు సిండికేట్​గా మారి క్వాలిటీ లేదని సాకులు చెబుతూ రేటు తగ్గిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్​లో డిమాండ్ తగ్గిందని, ఎగుమతులు సరిగా జరగడంలేదంటూ రూ.13 వేల నుంచి రూ.14 వేల లోపే చెల్లిస్తున్నారు. దీంతో మంగళవారం తేజా రకానికి రూ.12 వేల నుంచి రూ.14,350 ధర పలికింది. జనవరితో పోలిస్తే దాదాపు రూ.6 వేలు తగ్గింది. ఇక వండర్​ హాట్​కు రూ.16,100, యూఎస్–341కు రూ.15,100 రేటు దక్కింది.

ఈసారి పెరిగిన పెట్టుబడి

వానలతో ఈసారి మిర్చి పంట చాలా వరకు దెబ్బతింది. తెగుళ్లు సోకి దిగుబడి కూడా చాలా వరకు తగ్గింది. ఈ స్థితిలో పంటను దక్కించుకోవడానికి రైతులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. కలుపు, పురుగు మందులు, కూలీల ఖర్చు ఇలా అన్నీ కలిపి ఎకరానికి రూ.80 వేల నుంచి రూ.1 లక్ష వరకు పెట్టుబడి పెట్టారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి కాపాడిన పంటను అమ్ముకుందామంటే రేటు గిట్టుబాటు కావడం లేదని రైతులు అంటున్నరు.

పెద్దపల్లిలో పత్తి రైతుల రాస్తారోకో

ఒక్కరోజులోనే పత్తి ధర దాదాపు రూ.2వేలు తగ్గింది. మొన్నటి వరకు క్వింటాల్ పత్తి ధర రూ. 6వేల దాక పలుకగా సోమవారం రూ. 4వేలకు పడిపోయింది. పెద్దపల్లి మార్కెట్​లో వ్యాపారులు ఒక్కసారి ధర తగ్గించడంతో ఆగ్రహించిన రైతులు రాజీవ్ రహదారిపై రాస్తారోకోకు దిగారు. రెండు రోజుల సెలవు తరువాత సోమవారం ప్రారంభమైన పత్తి మార్కెట్ కు రైతులు సుమారు 800క్వింటాళ్ల పత్తి తీసుకొచ్చారు. అయితే వ్యాపారులు క్వింటాల్ పత్తికి కేవలంరూ. 3వేల నుంచి  రూ. 4వేల వరకు ధర నిర్ణయించారు. శుక్రవారం వరకు క్వింటాల్​కు రూ. 5900 నుంచి  రూ. 6200 వరకు ధర పలికిన పత్తికి ఒక్క సారిగా రూ.2వేల వరకు తగ్గించడంతో ఆగ్రహించిన రైతులు రాజీవ్ రహదారిపై  ధర్నాకు దిగారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. చివరకు పోలీసులు, అధికారులు జోక్యం చేసుకొని గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. అయితే రాస్తారోకో తర్వాత వ్యాపారులు నామమాత్రంగా క్వింటాల్​కు రూ.200 మాత్రమే ఎక్కువ చెల్లించడం గమనార్హం.

పెట్టుబడి ఎల్తదో లేదో..

రెండెకరాల్లో యూఎస్​ 341 రకం మిర్చి వేశాను. ప్రస్తుతం 45 బస్తాలు మార్కెట్​కు తీసుకొస్తే 13,600 పెట్టి కొనుగోలు చేశారు. అప్పట్లో 20 వేల వరకు ధర కట్టిచ్చారు. ఆ రేటే ఉంటే బాగుండేది. ఇప్పుడు వ్యాపారులు ఇస్తున్న దాంతో పెట్టుబడి కూడా చేతికి వచ్చేటట్టు లేదు.

– నర్సింగ్, మిర్చి రైతు, తాడ్వాయి

క్వింటాల్​ పత్తికి రూ.3,900 పెట్టిన్రు..

రెండు ఎకరాల్లో పత్తి ఏసిన.. పంట దెబ్బతిన్నది. ఆరంటే ఆరు గోతాల పత్తి మార్కెట్​కు తెచ్చిన. నిన్న, మొన్నటి దాక క్వింటాల్ పత్తికి రూ. 6వేలు రేటుండే. సోమవారం మార్కెట్​లో వ్యాపారులు కుమ్మకై నా పత్తికి రూ. 3900 ధర పెట్టిన్రు. ఆఫీసర్లను అడుగుదామంటే ఒక్కరు కూడా దిక్కులేరు. గింత అన్యాయం ఉంటదా? అందుకే ఏం జేయాలో తెల్వక రోడ్డు ఎక్కినం.                                       – శ్రీనివాస్​, పత్తి రైతు, పెద్దపల్లి జిల్లా


గిట్టుబాటు ఐతలేదు

మాకున్న ఎకరంలో తేజ రకం మిర్చి ఏసిన. అప్పట్లో కురిసిన వానలకు పంట కొంత ఖరాబైంది. కాపాడుకోనికి పెట్టుబడి, కూలీల ఖర్చు అన్నీ కలిపి 1లక్షా 20 వేల రూపాయల దాక ఖర్చు పెట్టిన. అయినా దిగుబడి బాగా తక్కువొచ్చింది. ఇప్పుడు బీట్​కు​తీసుకొస్తే క్వింటాకు రూ.13వేలు ధర కట్టిస్తున్నరు. ఆ ధర అస్సలు గిట్టు బాటు అయితలేదు. ఇంకో దిక్కులేక ఎంతో కొంతకు అమ్ముకోవాల్సి వస్తోంది.

– భిక్షపతి, మిర్చి రైతు, ములుగు

ఈ-నామ్​ పద్ధతి వద్దు..

పెద్దపల్లి మార్కెట్​లో ఈ-నామ్​ పద్ధతిలో రెండేళ్లుగా పత్తి కొనుగోళ్లు జరుగుతున్నయి. అయితే ఆన్​లైన్​లో ధరల నిర్ణయంతో నష్టపోతున్నామని రైతులు అంటున్నారు. ఆన్​లైన్ పద్ధతిలో కాకుండా ఓపెన్ వేలం ద్వారా పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ-నామ్ పద్ధతిలో ట్రేడర్లు ఇష్టం వచ్చినట్లు ధరలు నిర్ణయించుకొని తమను నిలువునా ముంచుతున్నారని రైతులు ఆరోపించారు.