దేశ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 11.58%

దేశ ఎగుమతుల్లో  తెలంగాణ వాటా 11.58%

హైదరాబాద్, వెలుగు: టీఎస్​ ఐపాస్​తో తెలంగాణకు రూ.1,96,404 కోట్ల పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు. దేశ ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 10.61 శాతం నుంచి 11.58 శాతానికి పెరిగిందన్నారు. జాతీయ జీఎస్​డీపీ సగటుతో పోల్చితే తెలంగాణ 8.2 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిందని చెప్పారు. జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా 4.55 శాతం నుంచి.. 2019–20లో 4.76 శాతానికి పెరిగిందని తెలిపారు. తలసరి ఆదాయం విషయంలో జాతీయ సగటు రూ.1,34,432 ఉంటే.. తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,28,216గా నమోదైందని అన్నారు. ​పరిశ్రమల శాఖ 2019–20 వార్షిక ప్రగతి నివేదికను మంగళవారం ప్రగతిభవన్​లో కేటీఆర్​ విడుదల చేశారు. టీఎస్​ఐపాస్​తో ఇప్పటి వరకు 12,021 పరిశ్రమలు అనుమతి పొందాయని, వీటిలో 75 శాతానికిపైగా కార్యకలాపాలను ప్రారంభించాయని చెప్పారు. రానున్న రోజుల్లో తెలంగాణకు రూ.45,848 కోట్ల పెట్టుబడులు మెగా ప్రాజెక్టుల రూపంలో రానున్నాయని, దీంతో 83 వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు.