ట్రైనింగ్​తో మురిపించి.. సాయం మరిచిండ్రు

ట్రైనింగ్​తో మురిపించి.. సాయం మరిచిండ్రు
  • పైసలు కట్టించుకుని ఆధునిక పనిముట్లు ఇయ్యని సర్కారు
  • రాష్ట్ర వ్యాప్తంగా 323 మంది కుమ్మరుల ఎదురు చూపులు
  • రూ.20వేల డీడీ తీసి రెండేళ్లవుతోందని ఆవేదన

పెద్దపల్లి, వెలుగు: కుల వృత్తులకు వన్నె తెస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీ అమలు కావట్లేదు. మట్టి పాత్రల వినియోగం పెంచి కుమ్మరుల ఆర్థిక స్థితిగతులు మారుస్తామని మురిపించి అంతలోనే మరిచింది. మూడేళ్ల క్రితం ఆర్భాటంగా ఆధునిక మట్టి పాత్రల తయారీపై శిక్షణ ఇప్పించి వదిలేసింది. సబ్సిడీ కింద లక్ష రూపాయల పనిముట్లు ఇస్తామని రూ.20 వేలు డీడీ కట్టించుకుని ఇంతవరకు ఇయ్యలేదు. శిక్షణ పొందిన వందల మంది కుమ్మరులు పనిముట్లు ఎప్పుడు వస్తాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. 
ఆలోచన మంచిదే కానీ..
హెల్త్​, టేస్ట్​తదితర కారణాలతో నేటితరం మట్టి పాత్రలు వాడేందుకు ఇష్టపడుతోంది. మట్టి కుండల్లోని నీళ్లు తాగడం మళ్లీ మొదలైంది. డాక్టర్ల సలహా మేరకు  స్టీల్, ప్లాస్టిక్ పాత్రల స్థానంలో మట్టి పాత్రలు వాడడం ఇటీవల పెరిగింది. ప్రస్తుతం గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల నుంచి వివిధ రూపాల్లో మట్టి పాత్రలు తెలంగాణకు దిగుమతి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలోనే ఆధునిక మట్టి పాత్రలు తయారు చేసేలా  ఇక్కడి కుమ్మరులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2018లో గుజరాత్, తమిళనాడులో తయారవుతున్న పాత్రలు, బొమ్మలు, వాడుతున్న సామగ్రి, టెక్నాలజీపై అధ్యయనం కోసం రాష్ట్రం నుంచి ఆరుగురితో కూడిన టీమ్​ను పంపించింది. ఆ బృందం ఇచ్చిన రిపోర్టు ఆధారంగా అన్ని జిల్లాల నుంచి 323 మంది కుమ్మరులను ఎంపిక చేసి యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్​పోచంపల్లిలో ఆధునిక మట్టి పాత్రల తయారీపై శిక్షణ ఇప్పించింది. అనంతరం సబ్సిడీపై రూ.లక్ష ఆధునిక పనిముట్లు ఇస్తామని చెప్పి శిక్షణ తీసుకున్న వారితో ఆఫీసర్లు రూ.20 వేల చొప్పున డీడీలు కట్టించుకున్నారు. 2019లో ఈ ప్రక్రియ పూర్తయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పనిముట్లు ఇవ్వలేదు. 323 మందిని ప్రధాన శిక్షకులుగా గుర్తించి వారితో రాష్ట్రంలో కుల వృత్తిపై ఆధారపడ్డ మిగిలిన కుమ్మరులందరికీ శిక్షణ ఇప్పించాలని ప్లాన్​చేసినా అదీ అమలు కాలేదు. డీడీ తీసి రెండేళ్లవుతున్నా పట్టించుకోని సర్కార్​తీరుపై శిక్షణ పొందిన కుమ్మరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనిముట్లు అందజేయాలని కోరుతున్నారు.


కొవిడ్​తో లేట్​అయ్యింది
కొవిడ్ కారణంగా ప్రాసెస్​లేటైంది. పెద్దపల్లి జిల్లా నుంచి 8 మంది కుమ్మరులు శిక్షణ పొంది రూ. 20 వేలు డీడీ కట్టారు. అలాగే స్టేట్​ మొత్తం 300 మందికి పైగా శిక్షణ తీసుకున్నారు. కొద్ది రోజుల్లోనే స్కీమ్​ప్రాసెస్ మొదలవుతుంది. ప్రభుత్వం గైడ్​ లైన్స్​ ప్రకారం సబ్సిడీపై ఆధునిక పనిముట్లు అందించే ఏర్పాట్లు చేస్తాం.
                                                                                                                                                                    – రంగారెడ్డి, బీసీ, మైనార్టీ వెల్ఫేర్​ ఆఫీసర్, పెద్దపల్లి