లీడర్ల భూమి గొడవతోనే.. వాచ్​మన్​కు నిప్పంటించారు

లీడర్ల భూమి గొడవతోనే..  వాచ్​మన్​కు నిప్పంటించారు
  • ఓల్డ్​ బోయిన్​పల్లిలో ఇద్దరు నేతల మధ్య భూ వివాదం
  • ఇప్పటికే ఎనిమిది కేసులున్నట్టు పోలీసుల వెల్లడి
  • వారం నుంచి పరస్పర దాడులు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లోని ఓల్డ్​ బోయిన్​పల్లిలో వాచ్​మన్​ను సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించిన ఘటన కొత్త మలుపులు తిరుగుతోంది. ఓ విలువైన భూమి విషయంగా ఇద్దరి మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్టు పోలీసులు గుర్తించారు. వారి మధ్య వారం రోజులుగా దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయని, ఇప్పటికే ఎనిమిది కేసులు నమోదయ్యాయని చెప్తున్నారు. అయితే భూవివాదం నెలకొన్న ఇద్దరు అధికార పార్టీకి చెందినవారని తెలుస్తోంది. ఆ ఇద్దరికి కూడా ప్రభుత్వంలో కీలకమైన నేతల అండ ఉందని సమాచారం. కాగా కిరోసిన్​ పోసి నిప్పంటించడంతో 40 శాతం కాలిన గాయాలైన వాచ్ మన్ శరణప్ప.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన విషయాలను ఇన్ స్పెక్టర్ అంజయ్య తెలిపారు. వివాదానికి కారణమైన భూమిపై ఎనిమిది కేసులు నమోదయ్యాయని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.

ప్రహరీ కూల్చివేతను అడ్డుకున్నరని..

ఓల్డ్​ బోయిన్ పల్లిలోని సిండికేట్​ కాలనీలో ఉన్న భూమి విషయంగా మాధవరెడ్డి, ప్రకాశ్​రెడ్డి అనే వ్యక్తుల మధ్య వివాదం ఉంది. దానిపై కోర్టులో కేసులు కూడా విచారణలో ఉన్నాయి. కోర్టులో కేసు ఉండగా ప్రకాశ్​రెడ్డి ఆ స్థలానికి ప్రహరీ గోడ నిర్మించాడంటూ మాధవరెడ్డి ఈ నెల 5న బోయిన్​పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత ఆ స్థలానికి వెళ్లి ప్రహరీగోడను కూల్చివేసేందుకు ప్రయత్నించారు. వాచ్​మన్, అతడి భార్య వారిని అడ్డుకున్నారు. గొడవ జరిగి వాచ్​మన్ కు, అతడి భార్యకు గాయాలయ్యాయి. దీంతో వారు మాధవరెడ్డి, మరికొందరు తమను కొట్టారని, లైంగికంగా వేధించారంటూ 6వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆగ్రహించిన మాధవరెడ్డి శనివారం తన అనుచరులతో వివాదాస్పద స్థలానికి వెళ్లి దాడి చేశారు. ఈ టైంలో వాచ్​మన్​ శరణప్పపై కిరోసిన్​ పోసి నిప్పంటించారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అన్ని ఘటనలపై కేసులు పెట్టామన్న పోలీసులు

వివాదాస్పద స్థలానికి సంబంధించి వారం రోజుల్లో మూడు ఘటనలపై కేసులు పెట్టినట్టు బోయినపల్లి పోలీసులు తెలిపారు. వాచ్ మన్ పై దాడి ఘటనలో కేసు నమోదు చేయలేదన్న వార్తలు అవాస్తవమన్నారు. పరారీలో ఉన్న మాధవరెడ్డి, ఇతర నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ స్థల వివాదంలో అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వాచ్​మన్​పై హత్యాయత్నం చేసినవారిని కాపాడేందుకు కొందరు లీడర్లు ప్రయత్నిస్తున్నారని.. వివాదాన్ని సెటిల్ మెంట్  చేసేందుకు రంగంలోకి దిగారని సమాచారం.

the watchman was tried to burn alive in an old Bowenpally because of leaders