కిచెన్​ వేస్ట్​కు క్విక్​ టిప్స్​

కిచెన్​ వేస్ట్​కు క్విక్​ టిప్స్​

ఏ ఇంటి కిచెన్​ షెల్ఫ్​లో చూసినా అంతో ఇంతో ప్లాస్టిక్​ కట్లెరీ, ప్యాకేజింగ్​ బాక్స్​లు కనిపిస్తాయి. అవి చూసినప్పుడల్లా ‘వీటిని ఎలాగైనా వదిలించుకోవాలి, ప్లాస్టిక్​ వాడకాన్ని ఎలాగైనా తగ్గించాల’ని చాలా గట్టిగా అనుకుంటారు. కానీ ప్లాస్టిక్​ వాడకంలో ఉన్న కన్వీనియెన్స్​, తక్కువ రేటు, రెడీ టు యూజ్​ అనేట్టు ఉండటంతో... ప్లాస్టిక్​కి ప్రత్యామ్నాయంగా మరో ఆప్షన్​ కనిపించదు. దాంతో ఒక పక్క వద్దనుకుంటూనే... మరో పక్క ప్లాస్టిక్​ వాడాల్సిన పరిస్థితి. అలాంటి వాళ్లు కొన్ని టెక్నిక్స్​ పాటిస్తే ఇంటి బూజు దులిపినట్టే.. ప్లాస్టిక్​ను వంటింట్లోకి రాకుండా చేయొచ్చు.

  •  ప్లాస్టిక్​ కట్లెరీ చూడగానే కంటికి ఇంపుగా కనిపిస్తుంది. కానీ ప్లాస్టిక్​ భూమిలో కలిసిపోవడానికి కొన్నివేల ఏండ్లు పడుతుంది. ఈ విషయం ప్లాస్టిక్​తో తయారుచేసిన వస్తువు వాడినప్పుడల్లా గుర్తుకొస్తే... ఆ తరువాత వాటివైపు చూపుపోదు. ఉదాహరణకు ఇంట్లో ప్లాస్టిక్​ స్పూన్లు వాడుతుంటే వాటికి బదులు చెక్క, మెటల్​తో చేసినవి వాడొచ్చు. అలాగే ఈ మధ్య ఎర్తీ ఫ్రెండ్లీగా తయారైన వస్తువులు మార్కెట్​లోకి వస్తున్నాయి. వాటిని వాడితే ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా... ఇంటికి క్లాసీ లుక్​ కూడా ఇచ్చినట్టు అవుతుంది.
  •  ప్లాస్టిక్​ కట్లెరీ వాడొద్దన్నారు కదా అని ఇంట్లో ఉన్న వాటన్నింటినీ వెంటనే బయట పారేయాల్సిన అవసరం లేదు. కాస్త కళాత్మకంగా ఆలోచించి వాటితో అందమైన ఫ్రేమ్స్​ లేదా పూలు చేయొచ్చు. జామ్​, పచ్చళ్ల బాటిల్స్​​ను కట్లెరీ పెట్టుకోవడానికి వాడుకోవచ్చు. అలా వాడితే వాటిని పెట్టుకునేందుకు విడిగా ప్లాస్టిక్​ హోల్డర్​ కొనాల్సిన అవసరమే రాదు.
  •  డిస్పోజబుల్​ కాఫీ మగ్స్​, టీ కప్పుల బదులు మళ్లీ వాడేలా రీయూజబుల్​ గ్లాస్​ లేదా బాటిల్స్, మంచినీళ్లు వెంట తీసుకెళ్లేందుకు కాపర్​ లేదా స్టీల్​ బాటిల్స్​ వాడొచ్చు. ఇంట్లో ఉన్న ప్లాస్టిక్​ బాటిల్స్​ను కిచెన్​ గార్డెన్​లో లేదా ఇంట్లో డెకరేట్​ పీస్​గా పెట్టి... వాటిలో మొక్కలు పెట్టుకోవచ్చు. ఒక ప్లాస్టిక్​ స్ట్రా డీకంపోజ్​ అయ్యేందుకు 300 నుంచి 500 ఏండ్లు పడుతుంది. అందుకని వాటికి బదులు మెటల్​, పేపర్​ లేదా వెదురు  స్ట్రాలు వాడొచ్చు. ఇంటినుంచి బయటకెళ్లేటప్పుడు రీయూజబుల్​ స్ట్రాలు పట్టుకెళ్లొచ్చు. 
  • ప్లాస్టిక్​ గిన్నెలకు బదులు చెక్కవి వాడాలి. పాత ప్లాస్టిక్​ గిన్నెలను మొక్కలకు సపోర్టుగా ఉండే ట్రేలా పెట్టుకోవచ్చు. లేదా పక్షులకు ఫుడ్​ పెట్టేందుకు వాడొచ్చు.
  • పాత కాలంలో వాడిన ఇనుప పెనం, స్టీల్​ కత్తుల లాంటివి కాస్త బాగు చేసుకుంటే సూపర్​గా ఉపయోగపడతాయి. ఒకవేళ మీకు అవి అవసరం లేకపోతే తోబుట్టువులకు లేదా మీ పిల్లలకు ఇవ్వొచ్చు. అవికూడా వారసత్వ ఆస్తులే! ఇలా చేయడం వల్ల వాటిని కొనాల్సిన ఖర్చు తగ్గి డబ్బు కూడా ఆదా అవుతుంది. 
  • పండ్లు, కాయగూరలను శుభ్రం చేసేందుకు రెగ్యులర్​గా డిస్​ఇన్ఫెక్టెంట్స్​ను ఎక్కువ కాలం​ వాడటం వల్ల చర్మం దెబ్బతింటుంది. రోగాలు కూడా వస్తాయి. అంతేకాదు ఈ రసాయనాలు పర్యావరణానికి కూడా ప్రమాదమే. అందుకే పండ్లు, కాయగూరలు శుభ్రం చేసేందుకు వాడే ప్రొడక్ట్స్​ తీసుకునేముందు రసాయనాలతో తయారైనవా? సహజ ఉత్పత్తులతో తయారుచేసినవా? అనేది గమనించాలి. సహజ పదార్థాలతో తయారు చేసిన డిస్​ఇన్ఫెక్టెంట్స్​నే వాడాలి. అలాంటివి అయితే పండ్లు, కాయగూరల క్వాలిటీ  దెబ్బ తినదు. ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.