2021లోనూ జరగకపోతే టోక్యో గేమ్స్ రద్దే

2021లోనూ జరగకపోతే టోక్యో గేమ్స్ రద్దే

స్పష్టం చేసిన ఐఓసీ చీఫ్ థామస్ బాచ్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ టోర్నమెంట్ వచ్చే ఏడాదికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నెక్స్ట్ ఇయర్ కూడా టోక్యో గేమ్స్ ఎంతవరకు జరుగుతుందనేది అనుమానంగా మారింది. కరోనా వ్యాక్సిన్ రావడానికి ఇంకా చాలా టైమ్ పడుతుందనే ఊహాగానాల మధ్య టోక్యో ఒలింపిక్స్ పైనా ఈ ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ) చీఫ్ థామస్ బాచ్ స్పందించారు. ఒకవేళ 2021లో కూడా టోక్యో గేమ్స్ జరగకపోతే టోర్నీని రద్దు చేసే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు.

‘స్పష్టంగా చెప్పాలంటే దీని గురించి నాకు కొంత అవగాహన ఉంది. 3 వేలు లేదా 5 వేల మందిని ఆర్గనైజింగ్ కమిటీలో ఉద్యోగుల్లా ఉంచలేం. ప్రతి ఏడాది వరల్డ్ వైడ్ గా ఉన్న అన్ని ఫెడరేషన్స్ కు సంబంధించిన స్పోర్ట్స్ షెడ్యూల్స్ ను మార్చలేం. అథ్లెట్లను అనిశ్చితిలో ఉంచలేం. వీటిన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటున్నాం. దీనిపై అనేక భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. 2021 సంవత్సరం జూలై 23న ప్రపంచం ఎలా ఉంటుందనే దానిపై మాకు స్పష్టత వచ్చినప్పుడు.. అప్పటి పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయాలు తీసుకుంటాం’ అని బాచ్ చెప్పారు.