ఒలింపిక్స్ లో మేరికోమ్ ఓటమి

ఒలింపిక్స్ లో మేరికోమ్ ఓటమి

టోక్యో: మహిళల బాక్సింగ్‌ ఆశాకిరణం మేరి కోమ్‌ ఓడిపోయింది. 48-51 కిలోల విభాగంలో ఇవాళ జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ లో  16వ రౌండ్‌లో మేరికోమ్ ను కొలంబియాకు చెందిన బాక్సర్‌ వలెంసియా 2-3 స్కారుతో ఓడించింది. దీంతో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరికోమ్ టోక్యో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్ అనంతరం జడ్జీలు ఇచ్చిన పాయింట్లతో తాను ఓడినట్లు గుర్తించి జీర్ణించుకోలేక కంటతడిపెట్టుకుని ఏడ్చేసింది.  
వాస్తవానికి వీరిద్దరి పోరు హోరాహోరీగా సాగింది. తొలి రౌండ్లో ఆటగాళ్ల శైలిని పరిశీలించిన ఐదుగురు జడ్జీలు మేరికోమ్ కు 46 పాయింట్లు ఇచ్చారు. ఈమె ప్రత్యర్థి వలెన్షియాకు 49 పాయింట్లు కేటాయించారు. దీంతో తొలి రౌండ్లో మేరికోమ్ మూడు పాయింట్ వెనుకబడింది. దీంతో రెండో రౌండ్ ఆరంభం నుంచి విజృంభించి అటాకింగ్ చేసింది మేరికోమ్. తన బాక్షింగ్ అనుభవాన్నంతా ఉపయోగించి పంచులు విసిరింది. 
మేరికోమ్ తో తలపడిన వలెన్షియా కూడా అదే స్థాయిలో చెలరేగి ఆడడంతో వీరిద్దరి పోరు హోరాహోరీగా సాగిందని భావించిన జడ్జీలు ఇద్దరికి సమాన స్కోర్ ఇచ్చారు. అయితే తొలి రౌండ్ లో మేరికోమ్ 3 పాయింట్లు వెనుకబడి ఉండడంతో ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. తొలి రౌండ్ ఆధిక్యతతో వలెన్షియా క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లింది. ఇవే ఆఖరి ఒలింపిక్స్ గా భావిస్తూ బరిలోకి దిగిన మేరికోమ్ 27-..30, 28..-29,30..-27,28..-29,29..-28 స్కోరు తేడాతో ఓటమి పాలై ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది.