ఎంపీ సంతోష్‌‌ అండతోనే కబ్జాలు

ఎంపీ సంతోష్‌‌ అండతోనే కబ్జాలు

మఠంపల్లి భూముల వివాదంలో ఆయన పాత్ర: ఉత్తమ్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: తాను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం మఠంపల్లి భూముల జోలికి ఎవరూ రాలేదని,  హుజూర్​నగర్​లో టీఆర్​ఎస్​ గెలిచాకే  వేలాది ఎకరాలు కబ్జా అయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌‌కుమార్‌‌ రెడ్డి ఆరోపించారు. సోమవారం గాంధీభవన్‌‌లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మఠంపల్లి భూముల వివాదంలో రాజ్యసభ సభ్యుడు సంతోష్‌‌కుమార్‌‌ జోక్యం ఉందని, ఆయన ఒత్తిడి వల్లే జిల్లా అధికారులు ఏ చర్యా తీసుకోవడం లేదన్నారు. వివాదాస్పద భూములపై ఆఫీసర్లకు ఎన్నో సార్లు లేఖలు రాసినట్టు చెప్పారు. తాము ఇచ్చిన కంప్లైంట్స్‌​పై స్పందించిన కొందరు ఎమ్మార్వోలను సస్పెండ్‌‌ చేశారని ఉత్తమ్‌‌ తెలిపారు. ఆ భూములు తమవేనన్న గిరిజనులపై టీఆర్‌‌ఎస్‌‌ నాయకులు రౌడీల్లా దాడులు చేయిస్తున్నారన్నారు. కేసీఆర్‌‌ అవినీతిపరుడని పదే పదే ఆరోపిస్తున్న బీజేపీ నేతలు ఎందుకు  సీబీఐతో ఎంక్వైరీ చేయించడం లేదన్నారు.  హుజూర్‌‌నగర్‌‌లో గిరిజనుల భూములు కాపాడేందుకు ఉత్తమ్‌‌ ఎంతోకాలంగా పోరాటం చేస్తున్నారని జీవన్‌‌ రెడ్డి  అన్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికే  కేసీఆర్​ సీఎం అయ్యారన్నారు. సీఎం పదవి ఎడమ కాలి చెప్పుతో సమానమని కేసీఆర్‌‌ అనడం.. రాజ్యాంగాన్ని అవమానపరచడమేనన్నారు. ఆయనకు సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదని ఫైరయ్యారు.