వ్యక్తి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు రివార్డు

వ్యక్తి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు రివార్డు

ఎల్‌బీ నగర్ ఫ్లైఓవర్ పై నుంచి కిందికి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని చాకచక్యంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ టి. సతీష్ కాపాడాడు. ఈ ఘటన (మే 12) శుక్రవారం జరిగింది. వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ పై స్థానికులు ప్రశంసలు కురిపించారు.

ఎల్‌బి నగర్‌ ఫ్లైఓవర్ పై ఓ వ్యక్తి నిలబడి దూకేస్తానంటూ బెదిరించాడు. అప్రమత్తమైన ప్రయాణికులు అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ కు సమాచారమిచ్చారు. దీంతో కానిస్టేబుల్ టి.సతీష్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఫ్లైఓవర్ పై నుంచి కిందికి దూకుతున్న వ్యక్తితో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అయినా... ఆ వ్యక్తి కిందికి దూకేస్తానని.. తన దగ్గరకు రావద్దని అనడంతో కానిస్టేబుల్ కంగారు పడ్డాడు. తర్వాత తన వద్ద ఉన్న వాకీటాకీతో మాట్లాడుతున్నట్లు నటిస్తూ.. ఆ వ్యక్తి దగ్గరకు మెల్లగా వెళ్లాడు.

ఇంతలోనే అటుగా వెళ్తున్న ఓ ప్రయాణికుడు ఫైఓవర్ పై నిలబడ్డ అతని దగ్గరకు వెళ్లి మాటలు కలిపాడు. దీంతో కానిస్టేబుల్ అతనిని చాకచక్యంగా పక్కకు లాగేశాడు. దీంతో అత‌ను ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. అనంత‌రం బాధిత వ్యక్తిని పోలీసుల‌కు అప్పగించారు. 

బాధితుడు జార్ఖండ్‌కు చెందిన మాంగ్రగా పోలీసులు గుర్తించారు. ఆర్థిక స‌మ‌స్యలు భరించలేక.. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయ‌త్నించిన‌ట్లు బాధితుడు పోలీసుల‌కు తెలిపాడు. మాంగ్రను కాపాడిన కానిస్టేబుల్ టీ సతీష్‌ను రాచ‌కొండ సీపీ డీఎస్ చౌహాన్ అభినందించి.. రివార్డు అంద‌జేశారు.