రేపు సిటీలో ట్రాఫిక్​ ఆంక్షలు..

రేపు సిటీలో ట్రాఫిక్​ ఆంక్షలు..

హైదరాబాద్​ రన్నర్స్, ఎయిర్​టెల్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఎయిర్​టెల్ హైదరాబాద్ మారథాన్​–2019’ కార్యక్రమం నిర్వహించనున్నారు.  మారథాన్​ సందర్భంగా సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు. నగరంలోని పీపుల్స్​ ప్లాజా నెక్లెస్​ రోడ్డు నుంచి హైటెక్​ సిటీ మీదుగా గచ్చిబౌలి వరకు  మొత్తం 42 కిలోమీటర్లు జరుగనున్న ఈ  మారథాన్​లో హాఫ్​  మారథాన్, ఫుల్​ మారథాన్​లు ఉదయం 5 గంటల నుండి 12 గంటల వరకు జరుగనుంది. 10కే రన్​ హైటెక్స్ ఎగ్జిబిషన్​ గ్రౌండ్​ నుండి గచ్చిబౌలి వరకు సాగనుంది. ఈ మారథాన్​ను దృష్టిలో పెట్టుకొని నగరంలో రన్​ జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేస్తూ సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు.

మారథాన్ రూట్..

ఎయిర్​టెల్ హైదరాబాద్​ మారథాన్​ రన్​ నెక్లెస్ రోడ్డులో ప్రారంభమై  ఖైరతాబాద్​ ఫ్లైఓవర్, రాజ్​భవన్​ రోడ్డు, సీఎం క్యాంపు కార్యాలయం,  పంజాగుట్ట ఫ్లైఓవర్,  ఎన్​టీఆర్​ భవన్,  జూబ్లీహిల్స్​ చెక్ పోస్టు,  పెద్దమ్మ తల్లి దేవాలయం,  నీరూస్​ జంక్షన్, మాదాపూర్, సైబర్​ టవర్స్​ మీదుగా   ఐకియా అండర్​ పాస్,  బయో డైవర్సిటీ జంక్షన్, సీపీ కార్యాలయం,  గచ్చిబౌలి ఫ్లైఓవర్​ మీదుగా ఇందిరానగర్, ఐఐఐటీ జంక్షన్, విప్రో సర్కిల్,  క్యూ సిటీ నుండి  హెచ్​సీయూ గేట్​ నెంబర్​ 2 మీదుగా గచ్చిబౌలి స్టేడియంకు చేరుకుంటుంది.  అదే విధంగా 10 కే రన్​ హైటెక్స్​ ప్రధాన ద్వారం వద్ద ప్రారంభమై శిల్పారామం,  సైబర్​ టవర్స్​ మీదుగా మైండ్​స్పేస్​​ అండర్​ పాస్,  బయోడైవర్సిటీ జంక్షన్, గచ్చిబౌలి ఫ్లైఓవర్,  ఇందిరానగర్,  ఐఐఐటీ జంక్షన్​ మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకు సాగుతుంది.

ట్రాఫిక్ మళ్లింపు

జూబ్లీహిల్స్​ నుండి కొత్తగూడ, కొండాపూర్​ రూట్​లో  వెళ్లే వాహనదారులు  జూబ్లీహిల్స్​ నీరూస్​ జంక్షన్​ మీదుగా మాదాపూర్​ 100 ఫీట్​ రోడ్డు, సైబర్​ టవర్స్​ వద్ద నుండి కొత్తగూడ వద్దకు చేరుకోవచ్చు.

జూబ్లీహిల్స్​ నుండి మైండ్​స్పేస్, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి ఓఆర్​ఆర్​..ఈ రహదారిలో వెళ్లే వారు  జూబ్లీహిల్స్​ నుండి మాదాపూర్​ 100 ఫీట్​ రోడ్డు, ఎంఎంటీఎస్​ రైల్వే స్టేషన్​ ఆర్​ఓబీ వద్ద యూటర్న్​ తీసుకొని సైబర్​ టవర్స్​ ఫ్లైఓవర్​ మీదుగా మైండ్​స్పేస్​కు చేరుకోవచ్చు.

రోడ్డు నెంబర్​ 45 జూబ్లీహిల్స్​ నుండి  గచ్చిబౌలి వైపు..ఈ రహదారిలో వచ్చే వాహనదారులు  మాదాపూర్​ నెక్టార్​ గార్డెన్​, దుర్గం చెరువు, ఇనార్బిట్​ మాల్, రహేజా  సీ గేట్​ నుండి మాదాపూర్​ ట్రాఫిక్​ పీఎస్​ మీదుగా బయోడైవర్సిటీ జంక్షన్​కు చేరుకొని అక్కడి నుండి గచ్చిబౌలి వైపు వెళ్లవచ్చు

బీహెచ్​ఈఎల్​, లింగంపల్లి నుండి గచ్చబౌలి వైపు…ఈ రహదారిలో  వచ్చే వారు హెచ్​సీయూ డిపో, మజీద్ బండ, బొటానికల్​ గార్డెన్​ మీదుగా గచ్చిబౌలి జంక్షన్​కు చేరుకోవచ్చు

గచ్చిబౌలి జంక్షన్​ టూ ఫైనాన్షియల్ డిస్ర్టిక్​..  ఈ రహదారిలో వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్​ నుండి  జీపీఆర్​ఎస్​ క్వార్టర్స్​ మీదుగా  గోపిచంద్​ అకాడమీ వద్ద నుండి విప్రో సర్కిల్ చేరుకోవచ్చు

గచ్చిబౌలి నుండి లింగంపల్లి వైపు…ఈ రూట్​లో వెళ్ల వారు  గచ్చిబౌలి జంక్షన్​, బొటానికల్ గార్డెన్​,  మజీద్ బండ,  హెచ్​సీయూ డిపో మీదుగా వెళ్లవచ్చే. లేదా బొటానికల్ గార్డెన్​ నుండి కొత్తగూడ జంక్షన్, కొండాపూర్, హఫీజ్​పేట్, ఆల్విన్​ సిగ్నల్​నుండి బీహెచ్​ఈఎల్​కు చేరుకోవచ్చు

నల్లగండ్ల, గోపాన్​పల్లి టూ విప్రో సర్కిల్.. నల్లగొండ్ల, గోపాన్​పల్లి నుండి విప్రో సర్కిల్ వైపు వెళ్లే వాహనదారులు గోపాన్​పల్లి తండా నుండి  వట్టినాగులపల్లి గ్రామం ఓఆర్​ఆర్​ మీదుగా కోకాపేట్​ రోటరీ వద్ద నుండి విప్రో జంక్షన్​కు చేరుకోవచ్చు.

 

నేడు హాఫ్ మారథాన్

మాదాపూర్‌, వెలుగు: హైదరాబాద్ రన్నర్స్​సొసైటీ, భారతి ఎయిర్‌‌టెల్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఐదు గంటలకు నెక్లెస్‌ రోడ్‌లో 5కే రన్‌ జరగనుంది.  ఉదయం 4:30 గంటల నుంచి 9 గంటల వరకు ట్రాఫిక్ దారి మళ్లింపులు చేశారు. పీపుల ప్లాజా, నెక్లెస్ రోడ్స్ నుంచి ప్రారంభమయ్యే హైదరాబాద్ మారథాన్ రన్ గచ్చిబౌలీ స్టేడియం వరకు సాగనుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్ కు సీపీ అంజనీకుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. రన్ జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ దారి మళ్ళించారు. వివి విగ్రహం, నెక్లెస్ రోడ్స్, రోటరీ, నిరంకరి భవన్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్,ఖైరతాబాద్ బడా గణేష్, అప్పర్ ట్యాంక్‌బండ్,లిబర్టీ,రాజ్ భవన్ రోడ్స్, సాగర్ సొసైటీ, జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్క్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ దారి మళ్లించారు.