డ్రంకెన్​డ్రైవ్​లో డ్రైవర్​పై కానిస్టేబుల్ దాడి.. తోటి డ్రైవర్లతో కలిసి ధర్నా

డ్రంకెన్​డ్రైవ్​లో డ్రైవర్​పై కానిస్టేబుల్ దాడి.. తోటి డ్రైవర్లతో కలిసి ధర్నా

మిర్యాలగూడ,  వెలుగు :  డ్రంకెన్​ డ్రైవ్​ తనిఖీల్లో ఓ కానిస్టేబుల్ దాడిలో  డీసీఎం డ్రైవర్ చేతివేళ్లు విరగడంతో  నిరసనగా బాధితుడు, కుటుంబ సభ్యులు, సహచర డ్రైవర్లతో కలిసి గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ ట్రాఫిక్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.  బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణ   శివారులోని ఎఫ్ సీఐ వద్ద బుధవారం రాత్రి  ట్రాఫిక్  పోలీసులు డ్రంకెన్​డ్రైవ్ తనిఖీలు చేశారు.  ఇదే టైంలో నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బాబు సాయిపేట గ్రామానికి చెందిన డీసీఎం డ్రైవర్ ఎర్ర సైదులు తన బైక్ పై స్వగ్రామం బయలు దేరాడు. ఎఫ్ సీఐ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్  పోలీసులను గమనించిన సైదులు బైక్​ వెనక్కి తిప్పి  వెళ్లేందుకు ప్రయత్నించాడు. అక్కడే డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సుధీర్ మరో అధికారి అతన్ని పట్టుకున్నారు. 

బైక్​ తీసుకోండి నన్ను ఏమీ అనకండి అని వేడుకున్నప్పటికీ.. డ్రంకెన్​డ్రైవ్​తనిఖీలకు  సహకరించడం లేదని లాఠీలతో దాడి చేశారు.  దీంతో తన చేతి వేళ్లు విరిగిపోయాయని బాధితుడు ఆరోపించాడు.  డ్రంకెన్​ డ్రైవ్​లో పట్టుకొని ఫైన్​విధించిన బాగుండేదని.. లాఠీలతో కొట్టడంతో చేతివేళ్లు విరిగి ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని డ్రైవర్ వాపోయాడు. కాగా, ధర్నాతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.   సమాచారం అందుకున్న టూ టౌన్ సీఐ ఘటనా స్థలానికి చేరుకొని ఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.  దాడి చేసిన కానిస్టేబుల్ సుధీర్ పై చర్యలు చేపట్టాలని కోరుతూ రూరల్, వన్ టౌన్,  టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు ఎర్ర సైదులు 
తెలిపారు.