- సరైన దిశలోనే యూఎస్‌తో చర్చలు
- భారత్‌కు మెరుగైన వాణిజ్య ప్రయోజనాలు
- డిసెంబరులో ఈయూతో ఎఫ్‌టీఏ: గోయల్
న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి విడత ఖరారయిందని, ప్రస్తుతం ఇది ముసాయిదా (లీగల్డ్రాఫ్టింగ్) తయారీ దశలో ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఢిల్లీలో గురువారం జరిగిన ఎస్ఆర్సీసీ శతాబ్ది సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ ముసాయిదా తయారీ త్వరలోనే పూర్తవుతుందని, ఇతర పోటీ దేశాల కంటే భారత్‌కు మెరుగైన వాణిజ్య ప్రయోజనాలు లభించగానే దీన్ని అమల్లోకి తెస్తామని ప్రకటించారు. మూడు నెలల క్రితం, వారం రోజుల క్రితం చెప్పిన మాటకు తాను కట్టుబడి ఉన్నానని, ఇందులో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేశారు. భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) డిసెంబర్లో కుదురుతుందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నుంచి అమల్లోకి వస్తుందని గోయల్ వెల్లడించారు.
ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ యూఎస్‌తో వాణిజ్య ఒప్పంద చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని, సాధ్యమైనంత త్వరగా ఒప్పందంపై సంతకాలు చేస్తామని తెలిపారు. యూఎస్‌లో సుంకాల విధానం పూర్తిస్థాయిలో ఖరారైన తర్వాత, సెక్షన్ 301 కింద వచ్చే ఫలితాల ఆధారంగా ఇరు దేశాల పరస్పర అంగీకారంతో సంతకాలు జరుగుతాయని చెప్పారు. ఈ ఒప్పందం వల్ల ఇరు దేశాలకు మార్కెట్ ప్రవేశంతో పాటు ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తుందని, యూఎస్ రూపొందిస్తున్న కొత్త సుంకాల విధానంలో భారత్‌కు పోటీదారుల కంటే మెరుగైన అవకాశాలు దక్కుతాయని వివరించారు. మార్కెట్ సూత్రాలకు విరుద్ధంగా జరిగే అధిక పారిశ్రామిక ఉత్పత్తిని నియంత్రించాలని ఈ నెల ప్రారంభంలో భారత్‌తో పాటు 14 ఇతర దేశాలు పిలుపునిచ్చాయి. ఇలాంటి విధానాలు ప్రపంచ వాణిజ్యానికి చేటు చేస్తాయని, వీటిని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అగర్వాల్ అన్నారు.
వంద శాతం సుంకాలపై ఇప్పుడే ఏమీ చెప్పలేం..
రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించేందుకు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అధికారం ఇచ్చే చట్టం గురించి అడిగినప్పుడు, ఒప్పందం కుదిరాక దీనిపై మరింత స్పష్టత వస్తుందని అగర్వాల్అన్నారు. భారత్ మాత్రం స్థిరమైన సుంకాలను కోరుకుంటోందని అగర్వాల్ తెలిపారు. ఇరు దేశాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల సంఖ్య తగ్గిందని చెప్పారు. వచ్చే వారం యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత్‌లో పర్యటించనున్నారు. అమెరికాతో చర్చలు జరుగుతున్నాయని, రాయితీల విషయంలో ఒక పరిమితికి చేరుకున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో అధిక సుంకాలు ఉన్నప్పటికీ యూఎస్‌కు భారత ఎగుమతులు 0.92 శాతం పెరిగి 87.3 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.8.27 లక్షల కోట్లు) చేరగా, దిగుమతులు 15.95 శాతం పెరిగి 52.9 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.5.01 లక్షల కోట్లు) నమోదయ్యాయి. 2024 నుంచి 2025లో 40.89 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.3.87 లక్షల కోట్లు) ఉన్న వాణిజ్య మిగులు, 2025 నుంచి 2026లో 34.4 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.3.26 లక్షల కోట్లు) తగ్గింది.
100% టారిఫ్‌లపై10 రోజుల్లో నిర్ణయం: సెర్గియో గోర్
భారత్, యూఎస్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ముగింపు దశకు చేరుకుందని, ప్రధాన అంశాలన్నీ పరిష్కారమయ్యాయని భారత్‌లో యూఎస్ రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. ఢిల్లీలో గురువారం జరిగిన బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ఆయన మాట్లాడారు. యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమీసన్ గ్రీర్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ స్థాయిలో వస్తువులు, సుంకాలపై చర్చలు తుది దశలో ఉన్నాయన్నారు.
యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో త్వరలో ముంబై, జామ్‌నగర్‌లలో పర్యటిస్తారని సెర్గియో వెల్లడించారు. కాగా, రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతి చేసుకుంటున్న భారత్ సహా ఇతర దేశాలపై దాదాపు100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో10 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నారని ఆయన తెలిపారు. ఈ టారిఫ్‌లు ఏ ఒక్క దేశాన్ని లక్ష్యంగా చేసుకుని తెచ్చినవి కాదని పేర్కొన్నారు. రష్యా ఆంక్షల చట్టం ప్రకారం.. 30 రోజుల్లోగా అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఇప్పటివరకు దీని కింద ఏ దేశంపైనా ట్రంప్ ఆంక్షలు విధించలేదని వెల్లడించారు.
