వాషింగ్టన్: అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం అరోరాలో హిందూ ఆలయంపై కాల్పులు జరిపి, ఎక్కువ మందిని చంపాలని కుట్ర పన్నిన 19 ఏండ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాలటైన్‌కు చెందిన అలెగ్జాండ్రోస్ పాపోరాకిస్ అక్టోబర్ 11న దాడి చేసేందుకు వెళ్లినప్పుడు అతని రైఫిల్ జామ్ కావడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. పాపోరాకిస్ టాకో బెల్ రెస్టారెంట్లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. “ఇండియన్స్‌ను చంపేందుకు వేచిచూస్తున్నాను” అని రెస్టారెంట్‌లోని సహోద్యోగులతో చెప్పినట్లు విచారణలో తేలింది.
అలాగే నిందితుడు ‘వై ఐ ఫాట్: ఏకే ఏ’ పేరుతో ఎనిమిది పేజీల మేనిఫెస్టోను కూడా రాసుకున్నాడు. అందులో శ్వేతజాతి ఆధిపత్య, నియో-నాజీ ఐడియాలజీ వ్యక్తం చేశాడు. ఇండియన్స్, యూదులు, ఆఫ్రికన్ అమెరికన్లపై ద్వేషాన్ని కక్కుతూ, వీలైనంత ఎక్కువ మందిని చంపాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అక్టోబర్ 11న తన మాస్ఫైరింగ్ఆలోచన అమలు చేసేందుకు అరోరాలోని ఓ హిందూ ఆలయానికి వెళ్లాడు. రైఫిల్ జామ్ కావడంతో పారిపోయాడు. కాగా, యూఎస్‌లో జాత్యహంకార, భారత వ్యతిరేక ద్వేషం పెరుగుతుండటంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. జాతి విద్వేషంతో కూడిన హింసను సహించకూడదని, భారతీయుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరింది.
