వ్యాక్సిన్ రికార్డ్.. ఒకేరోజు 20 లక్షల మందికి టీకా

వ్యాక్సిన్ రికార్డ్.. ఒకేరోజు 20 లక్షల మందికి టీకా
  • కరోనా వ్యాక్సినేషన్‌లో రికార్డు
  • ఇప్పటి వరకు 2.30 కోట్ల మందికి వ్యాక్సిన్
  • కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ స్పీడ్ గా జరుగుతోంది. సోమవారం ఒక్కరోజే 20 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికమని తెలిపింది. ఈ నెల 8 నాటికి వ్యాక్సినేషన్ డ్రైవ్ కు 50 రోజులైందని.. ఆ రోజు 20,19,723 మందికి టీకా వేశామని చెప్పింది. వీరిలో 17,15,380 మందికి ఫస్ట్ డోస్.. 3,04,343 మందికి సెకండ్ డోస్ ఇచ్చామని వివరించింది. ఫస్ట్ డోస్ తీసుకున్నోళ్లలో 60 ఏండ్లకు పైబడినోళ్లు 12,22,351 మంది, 45 ఏండ్లకు పైబడి కోమార్బిటీస్ ఉన్నోళ్లు 2,21,148 మంది ఉన్నారంది. ‘‘జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ డ్రైవ్ లో మన దేశం రికార్డు సాధించింది. 24 గంటల వ్యవధిలో 20 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ పంపిణీ చేసింది” అని హెల్త్ మినిస్ట్రీ పేర్కొంది. కాగా, ఇప్పటి వరకు మొత్తం 2 కోట్ల 30 లక్షల 8వేల 733 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వెల్లడించింది. వీరిలో ఫస్ట్ డోస్ తీసుకున్న హెల్త్ కేర్ వర్కర్లు 70,75,010 మంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు 67,92,319 మంది ఉన్నారని.. సెకండ్ డోస్ తీసుకున్న హెల్త్ కేర్ వర్కర్లు 37,39,478 మంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు 3,25,972 మంది ఉన్నారని తెలిపింది. 60 ఏండ్లకు పైబడినోళ్లు 43,74,145 మంది, కోమార్బిటీస్ ఉన్నోళ్లు 7,01,809 మంది ఉన్నారని చెప్పింది.  

కొత్త కేసులు 15,388
దేశంలో కొత్తగా 15,388 కేసులు నమోదైనట్లు హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 8,744, కేరళలో 1,412, పంజాబ్ లో 1,229 నమోదైనట్లు తెలిపింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,87,462 ఉన్నాయని.. ఇవి మొత్తం కేసుల్లో 1.67 శాతమని చెప్పింది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, కర్నాటకలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోందని హెల్త్ మినిస్ట్రీ ఆందోళన వ్యక్తంచేసింది. కొత్త కేసుల్లో 84.04 శాతం ఈ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని తెలిపింది. మొత్తం కేసుల సంఖ్య కోటీ 12 లక్షల 44వేల 786కు పెరిగిందని చెప్పింది. కరోనా నుంచి కోలుకున్నోళ్ల సంఖ్య కోటీ 8లక్షల 99వేల 394కు చేరిందని.. రికవరీ రేటు 96.93 శాతంగా ఉందని పేర్కొంది. కాగా, కరోనాతో మరో 77 మంది మరణించారని.. మహారాష్ట్రలో 22 మంది, పంజాబ్ లో 14 మంది, కేరళలో 12 మంది చనిపోయారని వెల్లడించింది. మొత్తం మృతుల సంఖ్య 1,57,930కి చేరిందని.. మరణాల రేటు 1.40 శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో అత్యధికంగా 52,500 మంది, తమిళనాడులో 12,521 మంది, కర్నాటకలో 12,367 మంది, ఢిల్లీలో 10,924 మంది, పశ్చిమ బెంగాల్ లో 10,280 మంది, ఉత్తర ప్రదేశ్ లో 8,738 మంది, ఆంధ్రప్రదేశ్ లో 7,176 మంది చనిపోయారని వివరించింది. ఇప్పటి వరకు 22 కోట్ల 27 లక్షల 16 వేల 796 మందికి కరోనా టెస్టు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. 

ఢిల్లీలో టీకా ఫ్రీ.. బడ్జెట్లో 50 కోట్లు కేటాయింపు
ఢిల్లీలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ను ఫ్రీగా అందజేస్తామని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. ‘‘గవర్నమెంట్ హాస్పిటళ్లలో అందరికీ ఫ్రీగా టీకా ఇస్తాం. ఇందుకోసం బడ్జెట్ లో రూ.50 కోట్లు కేటాయించాం. ప్రస్తుతం రోజుకు 45 వేల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నాం. దీన్ని త్వరలోనే 60 వేలకు పెంచుతాం” అని సిసోడియా ప్రకటించారు. ఆయన మంగళవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఢిల్లీలోని 192 హాస్పిటళ్లలో వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా, వాటిలో 56 గవర్నమెంట్ ఆస్పత్రులు ఉన్నాయి. సామాన్య జనానికి టీకా అందుబాటులోకి వచ్చినప్పుడు, ఫ్రీ వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని అధికారులు చెప్పారు.