స్కూళ్లలో కూరగాయలు పండిస్తరు

స్కూళ్లలో కూరగాయలు పండిస్తరు

హైదరాబాద్​, వెలుగు: రాష్ర్టంలోని సర్కారు బడుల్లో పెరటి తోటల పెంపకంపై స్కూల్​ఎడ్యుకేషన్​ దృష్టిపెట్టింది. ప్రతి స్కూల్​లో తప్పకుండా మునగ, కరివేపాకు చెట్లు పెట్టాలని నిర్ణయించింది. ఈ ఆదేశాలను అమలు చేసేలా చూడాలని ఇటీవల డీఈఓలు, ఎంఈఓలకు విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ రమణకుమార్​ ఉత్తర్వులు జారీచేశారు. స్టూడెంట్లకు మిడ్​ డే మీల్స్ లో వాడటానికి​ చెట్లు, మొక్కలు, కూరగాయల తోటలు పెట్టాలని ఇప్పటికే కేంద్రం రాష్ర్టాలకు ఆదేశాలిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 25వేల సర్కారు బడుల్లో సగం స్కూళ్లలో కూడా ఇది అమలు కావడం లేదు. దీంతో దీన్ని సీరియస్​గా తీసుకున్న ఎంహెచ్ఆర్డీ  కచ్చితంగా అమలు చేసేలా చూడాలని మరోసారి రాష్ర్టాలకు సూచించింది. దీంతో స్టేట్​ గవర్నమెంట్​ దృష్టి పెట్టింది. అన్ని స్కూల్స్​పరిసరాల్లో కనీసం ఆనపకాయ, బీరకాయ, కాకరకాయ, చిక్కుడు, బచ్చలి తదితర తీగజాతి మొక్కలతో పాటు టమాట, బెండకాయ, వంకాయ, పాలకూర, తోటకూర, మిర్చి, కొత్తిమీరతో పాటు పలు రకాల మొక్కలను నాటాలని ఎంఈఓలకు విద్యాశాఖాధికారులు ఆదేశాలిచ్చారు. వాటి నుంచి వచ్చే తాజా కూరగాయలను మిడ్​ డే మీల్స్​లో వడ్డించాలని కోరారు. బడుల్లో పెంచే పెరటితోటల ఫొటోలను స్కూల్​ఎడ్యుకేషన్ డైరెక్టరేట్​కు పంపించాలని ఆదేశించారు. డీఈఓలు స్కూల్స్​వారీగా ప్రతినెలా నివేదిక ఇవ్వాలని కోరారు.