TRS ఎమ్మెల్యే అండదండలతో మా ఇళ్లను కబ్జా చేశారు.. సీపీ ఆఫీసు ముందు బాధితుల ఆందోళన

TRS ఎమ్మెల్యే అండదండలతో మా ఇళ్లను కబ్జా చేశారు.. సీపీ ఆఫీసు ముందు బాధితుల ఆందోళన

హైదరాబాద్: రాచకొండ సీపీ ఆఫీసు ముందు క‌ర్మాన్‌ ఘాట్ ఇండ్ల బాధితుల ఆందోళన చేపట్టారు. J.N.N.U.R.M & A.A.Y(జవహర్‌లాల్ నెహ్రు నేష‌న‌ల్ అర్బ‌న్ రెన్యూవ‌ల్ మిష‌న్, అంత్యోద‌య అన్నా యోజ‌న‌) పథకం కింద తమకు కేటాయించిన ఇళ్లను కబ్జా దారులు ఆక్రమించారని ఆవేదన వ్య‌క్తం చేశారు. కబ్జా దారులకు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అండ దండలు ఉన్నాయంటూ ఆరోపించారు. బాధితులకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ మద్దతు తెలిపారు.

2006 లో సబ్సిడీ కింద ఖర్మాన్ ఘాట్ లో 512 ఇండ్లు మంజూరు చేయ‌గా.. మొత్తం 512 మంది, 80 వేల 200 రూ.ల డి.డీ కట్టారు. 2016 లో ఇళ్ల పట్టాలు, 2020 అక్టోబర్ లో అధికారులు ఇంటి తాళం చెవులు ఇవ్వ‌గా.. అక్క‌డ కరెంట్, డ్రైనేజి, వాటర్ పనులు పూర్తి కాలేదని లబ్ధిదారులు ఇళ్లలోకి వెళ్ళడానికి ఆసక్తి చూపలేదు. గ‌త ఏడాది డిసెంబర్ లో వెళ్లి చూసేసరికి అక్కడ కబ్జాదారులు నివాసం ఉంటున్నార‌ని ఇందిరా శోభ‌న్ తెలిపారు.

స్థానిక తెరాస నేతల అండ దండలతోనే కొంద‌రు దైర్యంగా త‌మ ఇళ్ల‌ను కబ్జా చేశారంటున్నారు బాధితులు. ఖాళీ చేయమ‌ని అడిగితే త‌మ‌పై భౌతిక దాడులు చేస్తున్నారు…దిక్కు ఉన్న చోట చెప్పుకోమంటున్నారని వాపోయారు. పైసా, పైసా పోగు చేసి, అప్పు చేసి 80 వేలు డీ.డీ కట్టామ‌ని, త‌మ కు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. నిజమైన లబ్ది దారులు అనేందుకు త‌మ‌ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, ఇదే చివరి ప్రయత్నం అని చెబుతున్నారు. సీపీ స్పందనను బట్టి ఏం చేయాలో నిర్ణయిస్తామ‌ని వారు తెలిపారు.