శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తాం

శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తాం

‘‘రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈడీ కార్యాలయం వరకు శాంతియుతంగా నిరసన కవాతు నిర్వహిస్తామ"ని ఏఐసీసీ మీడియా ఇన్‌ఛార్జ్ రణదీప్ సుర్జేవాలా అన్నారు. తాము రాజ్యాంగ పరిరక్షకులమన్న ఆయన..  ఎవరికీ తలవంచబోమని, భయపడమని స్పష్టం చేశారు. ఇంత మంది  పోలీసులు మోహరించడాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ దెబ్బకు మోడీ ప్రభుత్వం వణుకుతున్నట్టు తెలుస్తోందని అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో నేడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు తలపెట్టిన నిరసన ర్యాలీకి పోలీసులు నిరాకరించారు. కాగా ఏఐసీసీ కార్యాలయం వద్ద రాహుల్ గాంధీకి మద్దతుగా నినాదాలు పలుకుతూ, ప్లకార్డులతో పార్టీ నేతలు దర్శనమిచ్చారు. దీంతో పోలీసులు వీరిని అరెస్టు చేసి.. ఈ ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇంటి దగ్గర్లోనూ భారీ సంఖ్యలో పోలీసులు మోహరించినట్టు సమాచారం. అయితే ఈడీ కార్యాలయం వరకు తలపెట్టిన ఈ మార్చ్ ను ఉదయం 10గంటలకు ప్రారంభిస్తామని కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే ప్రకటించారు.