డిగ్రీ సీట్లలో ‘కోటా’ల సంగతేంది?

డిగ్రీ సీట్లలో ‘కోటా’ల సంగతేంది?

హైదరాబాద్, వెలుగు:డిగ్రీలో మేనేజ్‌మెంట్‌, ఈడబ్ల్యూఎస్‌ కోటాలపై సర్కారు స్పష్టతనివ్వక అయోమయ పరిస్థితి నెలకొంది. కోటాపై క్లారిటీ లేక అటు స్టూడెంట్లు, ఇటు కాలేజీల యాజమాన్యాలు ఆందోళన పడుతున్నాయి. ఈ స్పష్టత లేకనే దోస్త్‌ అప్లికేషన్ల ప్రక్రియ వాయిదా పడినట్లు తెలుస్తోంది.

70-30 అన్నరు కానీ..

రాష్ర్టంలో 955 డిగ్రీ కాలేజీలుండగా వీటిల్లో 804 ప్రైవేటు కాలేజీలు దోస్త్ పరిధిలో ఉన్నాయి. అన్ని కాలేజీల్లో కలిపి 3.66 లక్షల సీట్లున్నాయి. ప్రైవేటు కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా ఇవ్వాలని యాజమాన్యాలు కొంతకాలంగా కోరుతున్నాయి. సర్కారు కూడా దాదాపు ఓకే చెప్పిందని వార్తలు వినిపించాయి. 2020–21 నుంచి డిగ్రీ అడ్మిషన్లలో 70 శాతం కన్వీనర్ కోటా, 30 శాతం మేనేజ్‌మెంట్ కోటా పెట్టేందుకు అవకాశమివ్వాలని సర్కారుకు ఉన్నత విద్యామండలి కూడా ఫైల్ పెట్టింది. ఇది జరిగి నాలుగైదు నెలలైనా సర్కారు నుంచి స్పష్టత రాలేదు.

దోస్త్‌ నోటిఫికేషన్‌లోనూ..

ఇటీవలి దోస్త్ నోటిఫికేషన్‌లో కూడా మేనేజ్‌మెంట్‌, ఈడబ్ల్యూఎస్‌ కోటాను ప్రస్తావించలేదు. జులై 1 నుంచి దోస్త్ ఫస్ట్ ఫేజ్ అప్లికేషన్స్ ప్రాసెస్​ ప్రారంభమవుతోందని అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. కరోనా ఎఫెక్ట్ అంటూ తర్వాత వాయిదా వేశారు. అయితే డిగ్రీలో మేనేజ్‌మెంట్‌తో పాటు ఈడబ్ల్యూఎస్ కోటాపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వకపోవడంతోనే వాయిదా వేశారని అనుకుంటున్నారు. కోటాలపై స్పష్టత లేక ఇటు స్టూడెంట్లు, అటు యాజమాన్యాల్లో కూడా ఆందోళన నెలకొంది. దోస్త్ ద్వారా అడ్మిషన్స్ పొందితే దూర ప్రాంతాల్లో సీట్లు వచ్చే చాన్స్ ఉండటంతో లోకల్‌గా ప్రైవేటు కాలేజీల్లో చేరేందుకు స్టూడెంట్లు ఆసక్తి చూపిస్తున్నారు.

10 శాతం రిజర్వేషన్లపైనా నో క్లారిటీ

అగ్రకులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ కేంద్రం ఈడబ్ల్యూఎస్ చట్టం చేసింది. సెంట్రల్ వర్సిటీల్లో 2019–20 నుంచే అమల్లోకి తెస్తూ అందుకు అనుగుణంగా సీట్లు పెంచింది. రాష్ర్టాల్లోని విద్యాసంస్థల్లో 2020–21 నుంచి అమలు చేయాలని ఎంహెచ్‌ఆర్డీ చెప్పింది. ప్రస్తుతం డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్ రిలీజైంది. కానీ ఈడబ్ల్యూఎస్ కోటాపై ఉత్తర్వులివ్వలేదు. దీంతో ఓసీ కులాల్లోని పేద స్టూడెంట్లు ఆందోళన చెందుతున్నారు