కొత్త బిల్డింగ్​లు కూల్చుడెందుకు?

కొత్త బిల్డింగ్​లు కూల్చుడెందుకు?

పాత వాటిని కూలుస్తామంటే అర్థం ఉంటుంది
హెచ్, డీ బ్లాకులకు నలుదిక్కులా జాగా ఉంది

అలాంటి వాటిని కూల్చేస్తామనడం ఎందుకు
వాటిని వాడుకుని కొత్త బిల్డింగ్​లు కట్టొచ్చుకదా?

రాష్ట్ర సర్కార్​ను ప్రశ్నించిన హైకోర్టు

సెక్రటేరియట్​లో కొత్తగా కట్టిన వాటిని కూల్చుడు ఎందుకని హైకోర్టు రాష్ట్ర సర్కారును ప్రశ్నించింది. ఏడేండ్ల నాడు కట్టిన బ్లాకుల్లో లక్షా 40 వేల స్క్వేర్​ ఫీట్ల విస్తీర్ణం ఉందని, ఇంత పెద్ద ఎత్తున ఉన్న బిల్డింగ్​లను వినియోగించేలా ఎందుకు కొత్తవాటిని నిర్మించకూడదో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

హైదరాబాద్, వెలుగు: ‘‘సెక్రటేరియట్‌‌లో కొత్తగా కట్టిన వాటిని కూల్చుడు ఎందుకు? పాతబడిన బిల్డింగ్స్‌‌ను కూల్చేస్తామంటే అర్థం ఉంటుంది. సీ బ్లాక్‌‌లో అగ్నిప్రమాదం జరిగితే ఒకటే దారి ఉన్నందున కూల్చేస్తామంటే అర్థం చేసుకోవచ్చు. 125 ఏండ్ల నాటి భవనాల్ని కూల్చేస్తామంటే కూడా ధర్మమే. కానీ హెచ్, డీ లాంటి కొత్త బ్లాక్‌‌లకు నలుదిక్కులా బాగా జాగా ఉంది. ఎంతగా ఉందంటే సెట్‌‌బ్యాక్‌‌ రూల్స్‌‌ కంటే ఎక్కువగా ఉంది. వీటిని వాడుకోవచ్చు కదా. అయినా సరే వాటిని కూల్చేస్తామనడం ఎందుకు’’అని హైకోర్టు రాష్ట్ర సర్కార్‌‌ను ప్రశ్నించింది. ఏడేండ్ల నాడు కట్టిన బ్లాకుల్లో లక్షా 40 వేల స్క్వేర్​ ఫీట్ల విస్తీర్ణం ఉందని, ఇంత పెద్ద ఎత్తున ఉన్న బిల్డింగ్స్‌‌ను వినియోగించుకుంటూ కొత్త వాటిని ఎందుకు నిర్మించకూడదో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సెక్రటేరియట్‌‌ బిల్డింగ్ లను కూల్చాలన్న సర్కార్‌‌ నిర్ణయం చట్టవ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ తెలంగాణ డెమొక్రటిక్‌‌ ఫోరం కన్వీనర్ ప్రొఫెసర్‌‌ విశ్వేశ్వర్‌‌ రావు, ఎంపీ రేవంత్‌‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌‌రెడ్డి ఇతరులు వేర్వేరుగా దాఖలు చేసిన పిల్స్‌‌ను బుధవారం హైకోర్టు విచారించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ ఆర్ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ అభిషేక్‌‌రెడ్డితో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ ఈ పిల్స్​పై విచారణ జరిపింది.

కొత్త నిర్మాణాలతో పెరిగే విస్తీర్ణం ఎంత

ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ జె.రామచందర్​రావు వాదనలు వినిపిస్తూ.. పది లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో కొత్తగా సెక్రటేరియట్​ నిర్మించాలనేది సర్కార్‌‌ తీసుకున్న విధాన నిర్ణయమని చెప్పారు. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కోర్టుల జోక్యం తగదన్నారు. సాంకేతిక కమిటీ కూడా సెక్రటేరియట్​ భవనాలు కూల్చేసి కొత్త వాటిని నిర్మించాలని నివేదిక ఇచ్చిందని చెప్పారు. నివేదికను పరిశీలించిన బెంచ్.. ఇప్పుడు సెక్రటేరియట్‌‌ విస్తీర్ణం 9.16 లక్షల స్క్వేర్ ఫీట్లు ఉందని, కొత్తగా పది లక్షల స్క్వేర్ ఫీట్లను నిర్మించితే విస్తీర్ణం ఏపాటి పెరుగుతుందో చెప్పాలని ప్రశ్నించింది. ఒక బ్లాక్‌‌కు మరో బ్లాక్‌‌కు మధ్య గ్యాప్‌‌ లేదని, అగ్ని ప్రమాదాలు జరిగితే ఫైరింజన్‌‌ వెళ్లే జాగా కూడా లేదని రామచందర్‌‌రావు చెప్పారు. ఎన్ని బ్లాకుల్లో అగ్నిప్రమాదాలు జరిగాయని కోర్టు ప్రశ్నించగా, ఏ, హెచ్, జే, ఎల్‌‌ బ్లాకుల్లో ప్రమాదాలు జరిగాయన్నారు. జిల్లాల సంఖ్య 33కు పెరిగిందని, జిల్లా అధికారుల సమావేశానికి లేదా విదేశీ ప్రతినిధులు వస్తే భేటీ అయ్యేందుకు కాన్ఫరెన్స్‌‌ హాల్‌‌ లేదని, పార్కింగ్‌‌ సమస్య కూడా ఉందని తెలిపారు. కొత్త జాగా హెలిప్యాడ్‌‌కు కేటాయించారని, ఉన్న భవనాల్లో నీటి లీకేజీలు ఉన్నాయని, మురుగునీటి పైపుల వ్యవస్థ కూడా దెబ్బతిందని చెప్పారు. సెక్రటేరియట్​ కూల్చివేతపై ఇప్పటి వరకూ స్టే ఆదేశాలివ్వలేదని కోర్టు గుర్తు చేయగా, మౌఖిక ఆదేశాలను గౌరవించి కూల్చివేత చర్యలు ప్రారంభించలేదని రామచందర్​రావు చెప్పారు.

ఇప్పుడు నిర్మించాల్సిన అవసరం లేదు

రేవంత్‌‌రెడ్డి తరపు లాయర్‌‌ వాదిస్తుంటే బెంచ్ కల్పించుకుని.. కేబినెట్‌‌ తీసుకున్న పాలసీ డెసిషన్స్‌‌లో కోర్టులు జోక్యం చేసుకోరాదని ప్రభుత్వం వాదిస్తోందని, దీనిపై స్పందించాలని కోరింది. ఇప్పుడు వాస్తు పేరుతోనో, పాత భవనాలనో కూల్చేస్తే ఐదారేళ్లకు మరో సర్కార్‌‌ వచ్చి వాటిని కూల్చేస్తామంటే పరిస్థితి ఏమిటని రేవంత్​ తరపు లాయర్‌‌ ప్రశ్నించారు. వెయ్యి కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తేనే కొత్త బిల్డింగ్​లు వస్తాయని, మరో 50 నుంచి 60 ఏండ్లు భవనాలు ఉంటాయని, ఇప్పుడు నిర్మించాల్సిన అవసరం లేదనిచెప్పారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను 21కి వాయిదా వేసింది.