బండతో మూసివేసే చిన్న గదులే గాదె(గాజ)లు

బండతో మూసివేసే చిన్న గదులే గాదె(గాజ)లు

మూత పెట్టేందుకు వీలుగా వెదురుతో చేసిన ఆరడుగుల ఎత్తైన బుట్టల్ని లేదా బండతో మూసివేసే చిన్న గదులనే గాదె(గాజ)లు అంటారు. వీటిలోనే ఒకప్పుడు తిండిగింజల్ని  దాచుకునేవాళ్లు. ఇవి మన దగ్గరే కాదు, అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. వాటిలో స్విట్జర్లాండ్​లోని గాదెలు ప్రత్యేకం. వందల ఏండ్ల నాటి గాదెలు ఇప్పటికీ కనిపిస్తాయక్కడ. ముఖ్యంగా ఆ దేశంలోని ఆల్ఫ్స్​ పర్వతాలకు ఆనుకొని ఉన్న జర్మాట్​ ప్రాంతంలో ఇవి ఎక్కువగా ఉంటాయి. అప్పట్లో అక్కడి జనం తమ ఇంటిని రెండు అంతస్తులుగా కట్టుకునేవాళ్లు. అందులో పై భాగాన్ని ‘గాడి’ అని పిలిచేవాళ్లు. అదే తిండిగింజలు దాచుకునే గది. దీన్ని ఇంటి పై భాగంలో ఆరువైపులా పెద్ద చెక్కలు నిలబెట్టి, వాటిపై గుండ్రటి బండల్ని పెట్టి ఆ తర్వాత కట్టేవాళ్లు. గదిని పూర్తిగా చెక్కతోనే కట్టేవాళ్లు. చీమ కూడా వెళ్లలేనంతగా నున్నటి చెక్కల్ని ఒకదానిపై ఒకటి పేర్చేవాళ్లు. పై భాగంలో మాత్రం​ పలుచటి బండలు, లేదా చెక్కలు పెట్టేవాళ్లు. ఈ గదికి తలుపు కూడా ఉండేది. ఇప్పుడు ఈ గదుల అవసరం లేకపోయినప్పటికీ ఇంకా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు అక్కడివాళ్లు.

ఇటీవల కొందరు ఈ గాదెల్ని టూరిస్ట్​ హౌస్​లుగా మారుస్తున్నారు. వీటిలో ఉండడానికి టూరిస్ట్​లు కూడా ఇష్టపడుతున్నారు. టూరిజానికి కేరాఫ్​గా ఉన్న స్విట్జర్లాండ్​కు ఇది అదనపు ఆకర్షణ. ఎందుకంటే ఈ గదుల్లో ఉంటూ మంచుకొండలు, పచ్చటి మైదానాలను చూడడం అద్భుతమైన అనుభూతి అంటున్నారు టూరిస్ట్​లు. 

హమ్..​ అంటే ఉలిక్కిపడుతున్నారు!

‘ఊ అంటావా మామా.. ఉ.. ఉ.. అంటావా మామ...’ ఇది ఈ మధ్య వచ్చిన ఒక సినిమా పాట. ఆ మామ ‘ఊ’ అన్నాడో ‘ఉ..ఉ..’ అన్నాడో తెలియదు. కానీ, ఇంగ్లాండ్​లోని ఆ ఊళ్లో మాత్రం ‘హమ్...’ అని వినిపిస్తే చాలు ఉలిక్కిపడుతున్నారు అక్కడి జనం. ఇంతకీ ఈ ‘హమ్​’ గోల ఏంటని అంటున్నారా? అక్కడికే వస్తున్నాం. బ్రిటన్​లోని యార్క్​షైర్​ కౌంటీలో ఉంటుందా ఊరు. పేరు హామ్​ఫీల్డ్​. రెండేండ్లుగా గ్రామస్తులకు ‘హమ్​’ అనే శబ్దం వినిపిస్తోందట. అదీ పగలు, రాత్రి అనే తేడా లేకుండా! ఆ శబ్దం ఏంటో? ఎక్కడి నుంచి వస్తోందో తెలియక గ్రామస్తులు అల్లాడిపోయారు. చివరికి లోకల్​ అధికారులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు కూడా ఏమీ తేల్చలేకపోయారు. 
దాంతో ఆ శబ్దం ఏంటో కనుక్కోవడానికి ఏకంగా బ్రిటన్​ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఇటీవలే ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. దాదాపు రెండేండ్లు ఊరంతా తిరిగి పరిశోధన చేసినా ‘హమ్​’ శబ్దం ఎక్కడి నుంచి వస్తోందో కనుక్కోలేకపోయినట్లు చెప్పింది. అయితే, దాని సంగతి తేల్చేవరకూ వదిలిపెట్టమని గ్రామస్తులకు ధైర్యం చెప్పింది. విచిత్రమేంటంటే చాలా తక్కువ స్థాయిలో ఏకధాటిగా వచ్చే ఆ శబ్దం గ్రామస్తుల్లో కొందరికి వినిపించడం లేదట. అయితే, ఈ సౌండ్​ వల్ల ప్రశాంతత లేకుండా పోయిందని, నిద్ర దూరమైందని, మానసికంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ ఊరివాళ్లు చెప్తున్నారు. విచిత్రమేంటంటే ఇప్పుడా ఊరిని ‘హామ్​ఫీల్డ్​ హమ్​’గా పిలుస్తున్నారు! అయినా, ‘హమ్​’ పదం తెచ్చే తంటా ఏంటో ఫోన్​లో గంటల తరబడి చాటింగ్​ చేసుకునే ఇప్పటి యువతరానికి బాగా తెలుసు!