మరో రెండ్రోజుల పాటు సిటీలో ఎల్లో అలర్ట్

మరో రెండ్రోజుల పాటు సిటీలో ఎల్లో అలర్ట్


హైదరాబాద్ : గ్రేటర్​వ్యాప్తంగా వరుసగా ఆరో రోజు కూడా ముసురు పట్టే ఉంది.  సన్నగా వాన కురుస్తూనే ఉంది. అత్యధికంగా గాజులరామారంలో 2.6 సెంటిమీటర్ల వాన పడింది. రోడ్లపై అంతటా నీరు నిలువడంతో జనాలు ఇబ్బందులు పడ్డారు. నాలుగు రోజుల్లో 118 చెట్లు, కొన్నిచోట్ల కరెంట్​స్తంభాలు నెలకొరిగాయి. వర్ష ప్రభావం, నాలాలు ఉన్న, గతంలో వరదలు వచ్చిన 366 ప్రాంతాలను బల్దియా ఉన్నతాధికారులు సమస్యాత్మకంగా గుర్తించారు. ఎక్కడికక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. వీటిలో ఎల్​బీనగర్ జోన్​లో 74, చార్మినార్​లో 52, ఖైరతాబాద్​లో 85, శేరిలింగంపల్లిలో 52, కూకట్​పల్లిలో 48, సికింద్రాబాద్ జోన్​లో 55 సమస్యాత్మక ప్రాంతాలున్నాయి. ఇక్కడ భారీ వర్షాలు కురిస్తే అత్యవసర చర్యలు తీసుకునేందుకు 369 మంది అధికారులను నియమించారు.



కంట్రోల్ రూమ్​కు ఫిర్యాదులు.. 
బల్దియా ఏర్పాటు చేసిన కంట్రోల్​రూమ్ ​నంబర్లకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వాటర్ లాగింగ్, చెట్లు కూలడం, నిర్మాణ వ్యర్థాలు,  విద్యుత్, ఇంజనీరింగ్, స్ట్రీట్ లైట్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, వాటర్ సప్లై సమస్యలపై ఐదు రోజులుగా ఫిర్యాదులు పెరిగాయి. దాదాపు వెయ్యికి పైగా రాగా అత్యధికంగా 995 ఫిర్యాదులు వాటర్ లాగింగ్ కి సంబంధించనవి ఉన్నాయి. 118 ఫిర్యాదులు చెట్లు కూలినట్లు వచ్చాయి. వానలతో ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్ 040–- 21111111 లేదా 040–29555500 నంబర్లకు కాల్ చేయాలని  అధికారులు చెబుతున్నారు. వాతావరణ శాఖ సిటీకి మరో రెండ్రోజులపాటు ఎల్లో అలర్ట్​ను ప్రకటించింది. 
6 నుంచి 11 సెం.మీల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈదురు గాలులు గంటకు 8 నుంచి 18 కి.మీల వేగంతో వీస్తాయని పేర్కొంది. 

లోతట్టు ప్రాంతాల్లో..
రసూల్ పురా, సికింద్రాబాద్, మెట్టుగూడ, ఉప్పల్, రామంతాపూర్​, బాలంరాయి, అన్నానగర్, అంబర్ నగర్, మహ్మద్ గూడ, చిలకలగూడ, చిలుకానగర్, కంటోన్మెంట్​లోని పలు కాలనీలు, బస్తీలు నీటితో నిండిపోయాయి. బోయినపల్లిలో పొంగిపొర్లుతున్న నాలాలను స్థానిక నాయకులు పరిశీలించి ముందస్తు చర్యలు చేపట్టారు.  

కరెంట్ షాక్​తో 3 బర్రెలు మృతి
గండిపేట: కరెంట్ షాక్​తో మూడు బర్రెలు చనిపోయిన ఘటన బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలో జరిగింది. మంగళవారం ఉదయం 7వ డివిజన్ పద్మశ్రీ హిల్స్ కాలనీలో ఉండే కె. యాదయ్యకు చెందిన 3 బర్రెలు బయట మేత మేస్తున్నాయి. అదే ప్రాంతంలో కరెంట్ వైర్ తెగి కింద పడటంతో వాటిని తాకిన బర్రెలు కరెంట్ షాక్​తో అక్కడిక్కడే మృతి చెందాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బర్రెలు చనిపోయాయని.. తనను ఆదుకోవాలని యాదయ్య కోరాడు.