ఆన్‌లైన్‌లో కొనే వస్తువులను తాకేందుకు సాఫ్ట్ వేర్ తయారీ

ఆన్‌లైన్‌లో కొనే వస్తువులను తాకేందుకు సాఫ్ట్ వేర్ తయారీ

మీరు ఈ కామర్స్ సైట్లలో వస్తువులను కొనాలనుకున్నపుడు అది ఎలా ఉంటుందో, ఏమో అని ఎప్పుడైనా అనిపించిందా.. ? అలాంటి వారి కోసం పరిశోధకులు మద్రాస్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఓ సాఫ్ట్ వేర్ ను రూపొందించారు. ఈ ఫీచర్ వల్ల సైట్ లో కనిపించే వస్తువులను తాకి అనుభూతిని పొందవచ్చని ఈ సందర్భంగా తెలిపారు. వేలితో వస్తువులను తాకిన చోట మాత్రమే అది ఎలా ఉంది అన్న  విషయాన్ని ఊహించగలమని స్పష్టం చేశారు.

ఇంటరాక్టివ్ టచ్ యాక్టివ్ డిస్‌ప్లే కోసం సృష్టించిన ఈ టెక్నాలజీని ఐటాడ్ అంటారు. టచ్ డిస్ ప్లే టెక్నాలజీలో ఇది తరువాతి తరానికి చెందిందని మద్రాస్ ఐఐటీ పేర్కొంది. ఇది ఐటాడ్ యుగమని, ఈ సాంకేతికత ఆన్‌లైన్ షాపింగ్ అనుభవాన్ని తదుపరి స్థాయికి తీసుకెళుతుందని అప్లైడ్ మెకానిక్స్ విభాగానికి చెందిన ప్రధాన పరిశోధకుడు ఎం. ప్రొఫెసర్ మణివణ్ణన్ అన్నారు. ఈ -కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి కొనుగోలు చేసే ముందు వాటిని తాకవచ్చు, అనుభూతి చెందవచ్చని చెప్పారు. సాంకేతికతను అభివృద్ధి చేయడానికి టచ్‌ల్యాబ్ పరిశోధకులు, మెర్కెల్ హాప్టిక్స్‌తో కలిసి పనిచేయనున్నారు. ఈ పరికరాన్ని మరింత చిన్న సైజులో.. అంటే కంప్యూటర్ మౌస్ తరహా పరికరాన్ని రూపొందించడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా మెర్కెల్ హాప్టిక్స్ సీఈవో డాక్టర్ PV. పద్మప్రియ స్పష్టం చేశారు.