వీడి టెక్నిక్ ఏంటీ : రెండేళ్లుగా ఫైవ్ స్టార్ లో హోటల్ లో.. బిల్లు కట్టకుండా పరారీ..

వీడి టెక్నిక్ ఏంటీ : రెండేళ్లుగా ఫైవ్ స్టార్ లో హోటల్ లో.. బిల్లు కట్టకుండా పరారీ..

ఫైవ్ స్టార్ హోటల్ లో ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు. అద్భుతమైన సర్వీస్ లు, అందుబాటులో అన్ని సౌకర్యాలు, రుచికరమైన భోజనం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మరి ఇన్ని ఉన్న ఆ ప్రాంతంలో ఉండాలంటే ఖరీదు కూడా అలానే ఉంటుంది కదా. చాలా మంది ఫైవ్ స్టార్ హోటల్స్ కు వెళ్లాలని, బస చేయాలని ఆశగా ఉన్నా.. అది అత్యంత ఖర్చుతో కూడుకున్నది కాబట్టి.. అక్కడి వెళ్లేందుకు సామాన్య జనం వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం అన్ని సౌకర్యాలను వినియోగించుకుని, దాదాపు రెండేళ్లు అక్కడే ఉన్నా.. ఒక్క పైసా చెల్లించలేదు. ఫైవ్ స్టార్ హోటల్ అంటే మామూలు విషయం కాదు. ఒక్క రోజుకే వేలల్లో ఖర్చవుతుంది. అలాంటిది ఆ వ్యక్తి రెండేళ్లుగా ఓ గదిలో బస చేశాడు. దీనంతటికీ మొత్తం అయిన బిల్లు అక్షరాల రూ.58లక్షలు. దీన్ని చెల్లించకుండానే ఆ వ్యక్తి ఉడాయించాడు.

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న రోసేట్ హౌస్ లో ఇది జరిగింది. ఈ ఘటనతో రోసేట్ హౌస్ ను నిర్వహిస్తోన్న బర్డ్ ఎయిర్ పోర్ట్స్ హోటల్ ప్రైవేట్ లిమిటెడ్ పోలీసులను ఆశ్రయించింది. బిల్లు కట్టకుండా వెళ్లిన అంకుష్ దత్తాపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం.. అతను హోటల్ లో దాదాపు 603రోజువు ఉన్నాడు. మే 30, 2019 చెక్ ఇన్ అయిన అంకుష్ దత్తా.. జనవరి 22, 2021వరకు అక్కడే ఓ గదిలో బస చేశాడు. ఆ తర్వాత బిల్లు పే చేయకుండానే చెక్ అవుట్ అయ్యాడు.

హోటల్ కు మామూలుగా గది ధరలను నిర్ణయించే అధికారం ఉంది. అక్కడికి వచ్చే గెస్టుల బిల్లులను ట్రాక్ చేయడానికి హోటల్లో కంప్యూటర్ యాక్సెక్ కూడా ఉంది. అయితే వారి రికార్డులను నిర్వహించే అంతర్గత సాఫ్ట్ వేర్ ను మార్చి, దత్తా నుంచి కొంత నగదు లేదా మరేదైనా ప్రయోజనం పొంది ఉండవచ్చని, అందుకు ఎవరైనా సహకరించి ఉండవచ్చని నిర్వాహకులు అనుమానిస్తున్నారు. దత్తా కొంత మందితో కలిసి హోటల్ బిల్లలు చెల్లించకుండా తప్పించుకున్నాడని ఎఫ్ఐఆర్ పేర్కొంది. అయితే దత్తా వేర్వేరు తేదీల్లో రూ.10 లక్షలు, రూ.7లక్షలు, రూ.20 లక్షలను మూడు చెక్కులను ఇచ్చారని, కానీ అవన్నీ బౌన్స్ అయినట్టు తెలుస్తోంది.