ఫ్రీ బస్ వద్దా?.. హాట్ టాపిక్ గా మారిన ప్రధాని కామెంట్లు

ఫ్రీ బస్ వద్దా?.. హాట్ టాపిక్ గా మారిన ప్రధాని కామెంట్లు

హైదరాబాద్: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం వల్ల మెట్రో నిర్వహణ భారంగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ జాతీయ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. యాభై శాతం మంది బస్సులే ఎక్కుతారని, దీని వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తుతాయని అన్నారు. కాలుష్యం కారణంగా పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. మెట్రో రైల్ నిర్వహణ భారంగా మారుతుంది. కొత్త మెట్రో లైన్లు కూడా రావని అన్నారు.  దీంతో అభివృద్ధికి విఘాతం కలుగుతుందని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో పార్టీలు ఓట్ల కోసం ఇలాంటి పథకాలు ప్రవేశపెడుతున్నాయని అన్నారు.  

4 రాష్ట్రాల్లో ఫ్రీ బస్ జర్నీ

నాలుగు రాష్ట్రాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఈ పథకాన్ని మొదట ప్రారంభించింది. తర్వాత కర్నాటకలో కాంగ్రెస్ సర్కారు ఐదు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తోంది. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం కూడా మహిళలకు ఫ్రీ బస్ జర్నీని అమలు చేస్తోంది. ఈ నాలుగు కూడా ఇండియా కూటమిలోని భాగస్వాములైన పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలే. ఎన్డీఏ కూటమిలోని పార్టీలు, బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ మహిళలకు ఫ్రీ బస్ జర్నీ లేదు. 

ఏపీలో అమలు చేస్తామన్న కూటమి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13న ముగిశాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. వీళ్ల మ్యానిఫెస్టోలో తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఫ్రీ బస్ జర్నీ కల్పిస్తామని పేర్కొన్నారు. మోదీ ఫ్రీ బస్ జర్నీని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కూటమి అధికారంలోకి వస్తే ఈ హామీ అమలవుతుందా.? లేదా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. 

మీరు విమానాల్లో తిరగొచ్చా: కేజ్రీవాల్

మోదీ కామెంట్ పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ప్రధాని, కేంద్ర మంత్రులు విమానాల్లో ఫ్రీగా తిరగడం లేదా అని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సిన ప్రధాని ఇలాంటి కామెంట్లు చేయడం తగదని అన్నారు. ఉచిత బస్సు  సౌకర్యం రద్దు కావాలని ప్రధాని కోరుకుంటున్నారని అన్నారు.