- మల్టీ డిసిప్లినరీ కోర్సుల బ్రోచర్ ఆవిష్కరణ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు యువతే గొప్ప ఆస్తి అని, వారిని అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలతో తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. మారుతున్న గ్లోబల్ ట్రెండ్స్, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నత విద్యను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నట్లు తెలిపారు.
సోమవారం హైదరాబాద్‌లోని టీజీసీహెచ్ఈ వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ పురుషోత్తం, ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్‌తో కలిసి కొత్తగా ప్రవేశపెట్టిన మల్టీ డిసిప్లినరీ యూజీ, పీజీ కోర్సుల బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ రైజింగ్ తెలంగాణ –2047, వికసిత్ భారత్ –2047 విజన్‌లో భాగంగా ఈ విద్యా సంస్కరణలు చేపట్టామన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఫిన్ టెక్, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్, ఏవియేషన్, హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్, క్లైమేట్ సైన్స్ వంటి డిమాండ్ ఉన్న సబ్జెక్టులను కొత్త కోర్సుల్లో చేర్చినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చదువులో ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసి సరికొత్తగా ఏఐ ట్యూటర్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు.
పట్టణ, గ్రామాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ‘కోర్ ప్యూర్ రేర్’ అనే కొత్త అకడమిక్ మోడల్‌ను తీసుకొచ్చినట్టు చెప్పారు. కొత్త విద్యావిధానంలో భాగంగా 3 లేదా 4 ఏండ్ల డిగ్రీ కోర్సులను ఎంచుకోవచ్చని, మధ్యలో చదువు ఆపేసినా అప్పటివరకు చదివిన క్రెడిట్స్ అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ లో ఉంటాయని తెలిపారు.
నేడు టీ-సాట్‌లో అవగాహన సదస్సు..
కొత్త కోర్సులు, కెరీర్ అవకాశాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామని అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు టీసాట్ లో కొత్త కోర్సులపై ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
