హైదరాబాద్ లో ఇండ్లు, ఫ్లాట్లు, ఇంటి స్థలాలు కొనేవారికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక సూచనలు చేశారు. కొనుగోలు చేసే ముందు పూర్తి వివరాలు పరిశీలించుకోవాలని సూచించారు. ముఖ్యంగా చెరువుల FTL పరిధిలో ఉన్నాయా లేదా అన్నది ముందుగా పరిశీలించుకోవాలని చెప్పారు. ప్లాట్లు కొనేటప్పుడు అనుమతి పొందిన లేఔట్ ఉందా లేదా అనేది నిర్ధారించుకోవాలని సూచించారు.
ఇంటి నంబర్లు చూపించి లేదా బై నంబర్లతో ప్లాట్లు విక్రయిస్తే మరింత జాగ్రత్తగా పరిశీలించుకోవాలని చెప్పారు. గేటెడ్ కమ్యూనిటీలు అంటూ అమ్మే ప్లాట్లు, విల్లాలపై అనుమతులు ఉన్నాయా లేదా చెక్ చేయాలని సూచించారు. గేటెడ్ కమ్యూనిటీ అయితే చుట్టుపక్కల కాలనీలకు కనీసం 40 అడుగుల దారి చూపించారా లేదా అని చూసుకోవాలని చెప్పారు.
ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులతో ప్రజలకు సూచనలు చేశారు రంగనాథ్.. హైడ్రా ప్రజావాణికి మొత్తం 48 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఫిర్యాదులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫిర్యాదుదారుల ముందే గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ ఇమేజీలతో పరిశీలించి అధికారులకు చర్యల బాధ్యతలు అప్పగించారు.
