మరో 12 రోజుల్లో ఐపీఎల్ 19వ సీజన్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. 2026, మార్చి 28వ తేదీన ఆర్సీబీ వర్సెస్ -ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెర లేవనుంది. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా 19వ సీజన్ ప్రారంభ మ్యాచులకు దూరం కానున్నట్లు సమాచారం. దీంతో ఎస్ఆర్‌హెచ్ తాత్కాలిక కెప్టెన్‌గా టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మకు బాధ్యతలు అప్పగించనున్నట్లు స్పోర్ట్స్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
కానీ ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్సీ రేసులో అభిషేక్ శర్మ కంటే మరో ఇండియన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. అభిషేక్‌తో పోలీస్తే అన్ని విధాలా ఇషాన్ కిషన్‌కే అనుభవం ఎక్కువ. దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇషాన్ కిషన్ జార్ఖండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడమే కాకుండా టైటిల్ కూడా అందించాడు. అలాగే.. అంతర్జాతీయ మ్యాచులు ఆడిన అనుభవం కూడా అభిషేక్ శర్మతో పోల్చుకుంటే కిషన్‌కే ఎక్కువ.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఇషాన్ కిషన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లతో జరిగిన టీ20 సిరీస్‌లో దుమ్మురేపాడు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో భారత ట్రోఫీ గెలవడంలో కూడా కీ రోల్ ప్లే చేశాడు. ఇదే మెగా టోర్నీలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన అభిషేక్ శర్మ అట్టర్ ప్లాఫ్ అయ్యాడు.
జింబాబ్వే, ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్‌పై తప్ప మిగిలిన అన్ని మ్యాచుల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో అభిషేక్ శర్మకు కెప్టెన్సీ అప్పగిస్తే అతడిపై అదనపు భారం పడి అసలుకే ప్రమాదం వచ్చే అవకాశం ఉందని ఎస్ఆర్ హెచ్ మేనేజ్మెంట్ భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ సమీకరణాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఒకవేళ ప్యాట్ కమిన్స్ టోర్నీకి దూరమైతే అభిషేక్‌కు బదులు ఇషాన్ కిషన్‌కే జట్టు నాయకత్వ పగ్గాలు అప్పగించాలని ఎస్ఆర్‌హెచ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
