న్యూఢిల్లీ: ఇరాన్ నుంచి హార్మూజ్ జల సంధికి స్వేచ్ఛ కల్పించేందుకు యుద్ధ నౌకలు పంపాలని ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పిలుపును భారత్ లైట్ తీసుకుంది. హార్మూజ్ జల సంధిలో యుద్ధ నౌకల మోహరింపు అంశంపై అమెరికాతో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు జరపలేదని భారత విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది.
ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోమవారం (మార్చి 16) మీడియాతో మాట్లాడుతూ.. హార్మూజ్ జల సంధిలో వార్ షిప్స్ మోహరించాలన్న ట్రంప్ పిలుపుపై అనేక దేశాలు చర్చిస్తున్నాయని మాకు తెలుసు.. కానీ ఈ అంశంపై భారత్ అమెరికాతో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు జరపలేదని వివరణ ఇచ్చారు. ఈ అంశంపై ఇండియా అనేక మంది వాటాదారులతో చర్చలు కొనసాగిస్తుందని ఆయన తెలిపారు.
అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జల సంధిని ఇరాన్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. కాదు కూడదు అని ముందుకెళ్లే నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇరాన్ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు ఆటంకం ఏర్పడింది. కొన్ని దేశాల్లో ఇంధన సంక్షోభం తలెత్తింది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక పిలుపునిచ్చారు.
హార్మూజ్ జల సంధిలో చమురు నౌకలను కాపాడుకునేందుకు ఆయా దేశాలు తమ యుద్ధ నౌకలను పంపాలని పిలుపునిచ్చారు. హర్మూజ్ జల సంధిలో యుద్ధ నౌకలను మోహరించాలని కోరారు. ఇరాన్ నుంచి హార్మూజ్ జల సంధికి స్వేచ్ఛ కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అయితే.. ట్రంప్ పిలుపుకు ఆశించిన స్పందన రావడం లేదు.
హార్మూజ్ జల సంధిలో యుద్ధ నౌకలు మోహరించేందుకు చైనా నిర్ద్వందంగా తిరస్కరించింది. బ్రిటన్ కూడా ఇందుకు సముఖత వ్యక్తం చేయలేదు. యుద్ధం ఇప్పుడు ముగిస్తారో ముందు ట్రంప్ స్పష్టంగా చెప్పాలని యూరప్ కంట్రీస్ డిమాండ్ చేశాయి. ఇక, ఇండియా అయితే ఈ అంశంపై రెస్పాండే కాకపోవడం గమనార్హం. హార్మూజ్ జల సంధి విషయంలో తన పిలుపును పట్టించుకోని దేశాలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
