ఆశా వర్కర్ల   హామీలు అమలు చేయకపోతే అసెంబ్లీ  ముట్టడి : శ్రీనివాసులు    

ఆశా వర్కర్ల   హామీలు అమలు చేయకపోతే అసెంబ్లీ  ముట్టడి : శ్రీనివాసులు    

కందనూలు, వెలుగు:  కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాటుతున్నా  ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించకుండా అక్రమ అరెస్టులు చేస్తోందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి  శ్రీనివాసులు అన్నారు. సోమవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వంటావార్పు,   ధర్నా నిర్వహించారు.

 రాష్ట్రంలో  ఆశా కార్యకర్తలకు  పారితోషకాలు చెల్లించకుండా,  వెట్టి చాకిరి చేయిస్తున్నారన్నారు.  అధికారంలోకి వస్తే ఫిక్స్డ్ వేతనం అమలు చేస్తామని కాంగ్రెస్​ తమ మేనిఫెస్టోలో చెప్పి,  ఇప్పటివరకు ఆ హామీలు అమలు  చేయడం లేదన్నారు.  కనీస వేతనాలు అమలు చేయని కార్మికుల జీతాలకు చెల్లించని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైసింగ్ అనడం,  మూసీ సుందరీకరణ   పథకాలతో గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ఇప్పటికైనా హామీలు అమలు చేయాలని, లేకుంటే అసెంబ్లీని ముట్టడిస్తాం అని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో  సీఐటీయూ నాయకులు పర్వతాలు, పొదిల రామయ్య, కేవీపీఎస్​ జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న ఆశా వర్కర్స్ రజిత , జయమ్మ , కళావతి తదితరులు పాల్గొన్నారు.