ఖమ్మం టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చాలని, ఈ విషయంపై పార్లమెంట్ లో గళమెత్తుతానని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తెలిపారు. సోమవారం ఖమ్మం కాంగ్రెస్ ఆఫీస్లో డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా యుద్దంతో దేశంలో పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఎల్పీజీ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. ఇండస్ట్రీలకు వాడే గ్యాస్ ను గృహ అవసరాలకు మళ్లిస్తే కొరత ఉండేది కాదన్నారు. యుద్దం ఆగకపోతే రైతాంగం తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుందన్నారు.
ప్రధాని ఆల్ పార్టీ మీటింగ్ పెట్టకుండా ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలను కేంద్రం చిన్నచూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నేతలు నాగండ్ల దీపక్ చౌదరి, మానుకొండ రాధ కిశోర్, బాలసాని లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు.
