చిత్తూరు జిల్లాలో సైకో వీరంగం.. పోలీస్ జీప్ దొంగలించి.. చివరికి చెరువులో దాక్కొని...

చిత్తూరు జిల్లాలో సైకో వీరంగం.. పోలీస్ జీప్ దొంగలించి.. చివరికి చెరువులో దాక్కొని...

చిత్తూరు జిల్లాలో సైకో వీరంగం సృష్టించాడు. పోలీస్ జీప్ దొంగలించి వరుసగా వాహనాలను గుద్దుకుంటూ వెళ్లి జనాలకు వణుకు పుట్టించాడు సైకో. చిత్తూరు జిల్లా పలమనేరులోని గంగవరం మండలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. గంగవరం మండలం పరిధిలో సైకో వీరంగం సృష్టించాడు. చుట్టుపక్కల గ్రామాల్లో రెండు రోజులుగా మతిస్థిమితం లేకుండా తిరుగుతూ జనాన్ని ఇబ్బంది పెడుతున్న క్రమంలో సైకోను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులకు చుక్కలు చూపించాడు సైకో. 

ఈ క్రమంలో బెంగళూరు హైవేపై వైఎస్సార్ విగ్రహం దగ్గర  పోలీసులు అదుపులో తీసుకునే సమయంలో పోలీస్ వెహికల్ ను తీసుకొచ్చి వీరంగం సృష్టించాడు సైకో. మార్గం మధ్యలో గంగవరం ఫ్లైఓవర్ దగ్గర ఆటోను, కారును ఢీ కొట్టాడు. ఈ ఘటనలో పలువురికి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి.

వెంటనే అక్కడినుంచి పారిపోయి గంగవరం దగ్గర మన చెరువులో దూకేశాడు సైకో. సుమారు మూడు గంటలు చెరువులోనే దాక్కొని పోలీసులకు చెమటలు పట్టించాడు. అనంతరం సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చి సైకోను అదుపులోకి తీసుకున్నారు. సైకోకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సైకో వీరంగంతో వణికిపోయామని అంటున్నారు స్థానికులు. మద్యం మత్తులోనే సైకో రెచ్చిపోయాడని అంటున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.