ఇరాన్ మైండ్ గేమ్: భారత నౌకలకు దారి ఇవ్వటానికి పెట్టిన 2 షరతులివే!

ఇరాన్ మైండ్ గేమ్: భారత నౌకలకు దారి ఇవ్వటానికి పెట్టిన 2 షరతులివే!

పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలతో భారత్, ఇరాన్ దేశాల మధ్య 'షిప్పింగ్ వార్' ఆసక్తికర మలుపు తిరిగింది. హార్ముజ్ జలసంధి గుండా భారత జెండా ఉన్న నౌకలు అలాగే భారత్‌కు వచ్చే నౌకలను పోనివ్వాలంటే తమ వద్ద బందీలుగా ఉన్న 3 ఆయిల్ ట్యాంకర్లను ఇండియా తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ గట్టి షరతు విధించింది. భారత్ స్వాధీనం చేసుకున్న ఆస్ఫాల్ట్ స్టార్, అల్ జఫ్జియా, స్టెల్లార్ రూబీ అనే మూడు నౌకలను తిరిగి అప్పగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.

ఈ వివాదానికి ప్రధాన కారణం ఫిబ్రవరిలో భారత కోస్ట్ గార్డ్ తీసుకున్న చర్యలే. ఈ 3 నౌకలు తమ గుర్తింపును మార్చుకుని, సముద్రం మధ్యలో అక్రమంగా చమురును ఒక నౌక నుంచి మరో నౌకకు మారుస్తున్నాయనే ఆరోపణలతో ముంబై తీరంలో వీటిని నిలిపివేశారు. అయితే ఈ నౌకలకు తమకు సంబంధం లేదని గతంలో ప్రకటించిన ఇరాన్.. ఇప్పుడు ఆ షిప్స్ విడుదల కోసం పట్టుబట్టడం గమనార్హం. కేవలం నౌకల విడుదల మాత్రమే కాకుండా.. తమ దేశానికి అవసరమైన కొన్ని రకాల మందులు, వైద్య పరికరాలను సరఫరా చేయాలని కూడా ఇరాన్ రెండో షరతుగా పెట్టింది.

ఈ పరిణామాలు భారత్‌కు అత్యంత కీలకంగా మారాయి. ఎందుకంటే భారత్‌కు కావాల్సిన ఎల్పీజీ దిగుమతుల్లో సుమారు 90 శాతం ఈ గల్ఫ్ ప్రాంతం నుంచే వస్తాయి. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకోవటంతో రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికీ 22 భారతీయ నౌకలు, వందలాది మంది నావికులు చిక్కుకుపోయారు. ముఖ్యంగా వంట గ్యాస్ కొరత రాకుండా ఉండాలంటే.. అక్కడ నిలిచిపోయిన 6 ఎల్పీజీ నౌకలు భారత్ చేరడం చాలా కీలకం. ఈ నేపథ్యంలోనే సోమవారం ఢిల్లీలో ఇరాన్ రాయబారి భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో భేటీ అయ్యారు.

అయితే భారత్ మాత్రం ఈ షరతులపై ఆచితూచి స్పందిస్తోంది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయని, కానీ దేనికీ బదులుగా దేనిని మార్చుకోవడం లేదని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. ఇటీవల ఇరాన్ రెండు భారతీయ ఎల్పీజీ నౌకలను అనుమతించడం కొంత సానుకూల పరిణామమే అయినా, తమ నావికుల ప్రాణాలు, దేశ ఇంధన భద్రత దృష్ట్యా భారత్ ఈ సంక్షోభాన్ని ఎలా పరిష్కరిస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇరాన్ పెట్టిన ఈ కఠిన షరతులు అంగీకరిస్తారా లేదా మధ్యేమార్గంగా మరో దారి వెతుకుతారా అన్నది వేచి చూడాల్సిందే.