
రాయ్‌బరేలి: కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దశాబ్దాలుగా దేశ ప్రజలను కాంగ్రెస్ నాయకులు దోచుకున్నారని అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 17వ తేదీ శుక్రవారం అమిత్ షా.. స్మృతి ఇరానీ(అమేథీ), దినేష్ ప్రతాప్ సింగ్( రాయ్‌బరేలీ)లకు మద్దతుగా ఉత్తరప్రదేశ్‌లో ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో రాయ్‌బరేలిలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. చాలాకాలం నిరీక్షణ తర్వాత అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరిగిందన్నారు. అయితే, ప్రాణ ప్రతిష్ఠ సరైన రీతిలో జరగలేదని కాంగ్రెస్ అంటోంది మండిపడ్డారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరానికి బాబ్రీ తాళం వేస్తారని దుయ్యబట్టారు.
ప్రతిపక్షాలు వంశపారంపర్య రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. లాలూజీకి తన కొడుకు సిఎం కావాలని, మమతకు తన మేనల్లుడికి సీఎం కావాలి, సోనియా గాంధీకి తన కొడుకు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని షా అన్నారు. రాయ్‌బరేలీ, అమేథీ స్థానాల్లో తామే గెలుస్తామని ప్రతిపక్షాలు అంటున్నాయని.. కానీ కుటుంబ రాజకీయాలకు పాల్పడేవారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. స్మృతి ఇరానీ, దినేష్ ప్రతాప్ సింగ్ చాలా కష్టపడి పనిచేస్తున్నారని..అమేథీ, రాయ్‌బరేలీ రెండు నియోజకవర్గాల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఆర్టికల్ 370పై కాంగ్రెస్‌పై విరుచుకుపడిన ఆయన..కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 370కి రద్దు చేయలేకపోయిందని.. కానీ ప్రధాని మోడీ దానిని రద్దు చేశారని చెప్పారు. అంతేకాదు.. దేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టారని, ఉగ్రవాదులను తుడిచిపెట్టారని అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా మనదేనని.. ఎవరికీ భయపడలేదని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ నాయకులు అవినీతిపరులని.. ఇన్నాళ్లు దేశాన్ని దోచుకున్నారని ఆరోపించారు. అవినీతిపరులందరినీ మోదీ సర్కార్ జైల్లో పెడుతుందని షా హెచ్చరించారు.