- నా తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చే అధికారం మీకెక్కడిది?
- సీఎం రేవంత్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
- సరదాగా ఉంటే మీ పేరు రేవంత్ ఖాన్‌గా మార్చుకోవాలని కామెంట్
న్యూఢిల్లీ, వెలుగు: తాను ఎవరికీ దత్తపుత్రుడిని కానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పార్టీలు, జెండాలు మార్చే అలవాటున్న రేవంత్ రెడ్డికి.. తన పేరు మార్చే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. ‘‘నీకు ఇష్టమైతే నీ పేరును రేవంత్ ఖాన్‌గా మార్చుకో. అవసరమైతే మతం మార్చుకో. మాకు అభ్యంతరం లేదు. కానీ, నా ఇంటి పేరు, నా పేరు మార్చడానికి నువ్వెవరు?” అంటూ ఫైర్ అయ్యారు. సోమవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దత్తపుత్రుడు అని, కల్వకుంట్ల కిషన్ రావు అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపై ఆయన తీవ్రంగా స్పందించారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే తమపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నా.. మున్సిపల్ మంత్రిగా ఒక్క మోరీ అయినా బాగు చేశారా? అని నిలదీశారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులెన్ని, రాష్ట్రం ఇచ్చిన నిధులెన్ని అనే అంశంపై తాను చర్చకు సిద్ధమన్నారు. ‘‘నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరు కల మహదేవప్ప మృతి చెందడం బాధాకరం.
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. సీఎం సొంత జిల్లా కావడంతో అక్కడ బీజేపీ గెలుస్తుందనే భయంతో కాంగ్రెస్ నాయకులు కుట్రలకు తెరలేపారు. 15 రోజులుగా మహదేవప్పపై తీవ్ర ఒత్తిడి తెచ్చి, బెదిరిం పులకు గురిచేశారు. నామినేషన్ వేయకుండా అడ్డుకున్నరు. ప్రజల్లో బలం లేక దౌర్జన్యాలకు పాల్పడుతు న్నారు. కాంగ్రెస్ వేధింపులు తట్టుకోలేకే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి” అని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
మజ్లిస్‌తో కాపురంలో నిప్పులు పోస్తాం
మజ్లిస్ తో కాంగ్రెస్, బీఆర్ఎస్ రహస్య ఒప్పందాలు చేసుకున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎంఐఎంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కాపురం చేసినన్ని రోజులు నిప్పులు పోస్తూనే ఉంటామన్నారు. ‘ఆ రెండు పార్టీల స్టీరింగ్, హారన్, ఎస్కలేటర్ నా చేతుల్లోనే ఉన్నాయి’ అని అసదుద్దీన్ ఒవైసీ బహిరంగంగా చెబుతుంటే.. రేవంత్ రెడ్డి సిగ్గుపడాలన్నారు. రెడ్డి అయినా, రావు అయినా తమ దారుస్సలాం మెట్లు ఎక్కాల్సిందే అని అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీల దయనీయ స్థితికి అద్దం పడుతున్నాయన్నారు.
