చిట్యాల, వెలుగు: మార్చి చివరినాటికి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష గృహప్రవేశాలే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సెక్రటరీ వి.పి.గౌతమ్ తెలిపారు. మంగళవారం నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెదకాపర్తి గ్రామంలో కలెక్టర్ బి.చంద్రశేఖర్‌తో కలిసి నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ గృహాలను ఆయన తనిఖీ చేశారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి గృహాలను పరిశీలించి, బ్యాంకులో జమ అయిన మొత్తం, నిర్మాణ అంచనాలు, ఖర్చుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం మంజూరు చేసిన ఐదు లక్షల రూపాయలకంటే ఎక్కువ ఖర్చు పెట్టి ఇళ్లు నిర్మిస్తున్నట్లు గుర్తించిన సెక్రటరీ, అప్పులు చేసి అధిక వ్యయం చేయవద్దని, మంజూరు చేసిన నిధులలోపే ఇళ్లు పూర్తి చేయాలని సూచించారు. ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారులకు అవగాహన కల్పించి, స్థానిక మేస్త్రీల ద్వారా ఖర్చు తగ్గించేలా చూడాలని, మరోసారి సమావేశం నిర్వహించాలని సర్పంచ్ వీరన్నకు సూచించారు. జిల్లాలో ఫినిషింగ్ దశలో 6,300 ఇళ్లు ఉన్నాయని తెలియజేయగా, మార్చి చివరినాటికి వాటన్నింటినీ పూర్తి చేయాలని చెప్పారు.
అనంతరం ఎస్సీ కాలనీలో ఇంకా నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారులతో మాట్లాడి, మహిళా సంఘాల ద్వారా రూ. లక్ష రుణం మంజూరు చేసి వెంటనే ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని సూచించారు. లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్న సెక్రటరీ, ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారమే ఇళ్లు నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో జయలక్ష్మి, ఏఈ ప్రీతి, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు
