తమిళనాడులో ఉద్రిక్తత.. చెన్నై-తిరుచ్చి నేషనల్ హైవే బ్లాక్.. 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్

తమిళనాడులో ఉద్రిక్తత.. చెన్నై-తిరుచ్చి నేషనల్ హైవే బ్లాక్.. 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్

తమిళనాడులో కావేరి బ్రిడ్జి మరమ్మతు పనుల వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తిరుచిరాపల్లి-చెన్నై జాతీయ రహదారిపై స్థానిక ప్రజలు భారీ రాస్తారోకోకు దిగారు. సంజీవి నగర్ వద్ద వందలాది మంది రోడ్డుపై బైఠాయించడంతో జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

మరమ్మతు పనుల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) పాత కావేరి వంతెనను హఠాత్తుగా మూసివేయడమే ఈ వివాదానికి కారణమైంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ వంతెనకు మూడు నెలల పాటు రిపేర్లు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ముందస్తు సమాచారం సరిగ్గా ఇవ్వకుండా వంతెనను క్లోజ్ చేయడంతో.. గత రెండు రోజులుగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఓయామరి రోడ్, మాంబజ శాలై, తిరువానైకావల్ మార్గాల్లో దాదాపు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు నరకం చూస్తున్నారు.

ALSO READ : మూడు రోజులు తెలంగాణలో వర్షాలు సూచన

ఇటు ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఇరుక్కుపోయి గంటల తరబడి కదలలేని పరిస్థితి రావడంతో.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు రోడ్డుపైకి వచ్చారు. వంతెన పనులను యుద్ధప్రాతిపదికన వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, సంజీవి నగర్ వద్ద ఫ్లైఓవర్ నిర్మిస్తామంటూ స్థానిక ఎంపీ గతంలో ఇచ్చిన హామీలు ఏళ్ల తరబడి కాగితాలకే పరిమితమయ్యాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. నిరసనకారులతో చర్చలు జరిపారు. ఎలాగోలా వారిని శాంతింపజేసి, ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ప్రయత్నించారు.