తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో జూన్ 29న వీఐపీ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. ఈ క్రమంలో జూన్ 28(ఆదివారం) నాడు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. దీనితో పాటు, ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్‌లో ఏరోజుకారోజు జారీ చేసే 800 శ్రీవాణి దర్శన టికెట్ల జారీని కూడా సోమవారం నాడు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాబట్టి తిరుమలకు బయలుదేరే భక్తులు ఈ మార్పులను గమనించి, రద్దీకి అనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది.
వేసవి సెలవులు ముగిసిపోతుండటం, వీకెండ్ కావడంతో కలియుగ వైకుంఠం భక్తజనసందోహంగా మారింది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. వెలుపల ఉన్న క్యూలైన్లు సైతం బాలాజీ నగర్ ప్రాంతం వరకు కిలోమీటర్ల మేర విస్తరించాయి. స్వామివారి దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివస్తుండటంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీనియర్ అధికారులందరూ క్షేత్రస్థాయిలో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే సాధారణ భక్తులకు అత్యధికంగా దర్శన భాగ్యం కల్పించేందుకు వీలుగా... జూన్ 29 సోమవారం నాడు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
