ఎడ్లబండిని ఢీకొట్టిన కారు.. రైతు, ఎద్దు మృతి

ఎడ్లబండిని ఢీకొట్టిన కారు.. రైతు, ఎద్దు మృతి

చండూరు (మర్రిగూడ) వెలుగు: ఎడ్లబండిని కారు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి, ఒక ఎద్దు మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని లెంకలపల్లి గ్రామ శివారులో జరిగింది. లెంకలపల్లి గ్రామానికి చెందిన మద్ది మల్లేశ్(45), తన వద్ద కూలీ పనికి వచ్చిన చాపల పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి వ్యవసాయ పనులు ముగించుకుని ఎడ్లబండిపై ఇంటికి తిరిగి వస్తున్నారు.

పెద్దమ్మ దేవాలయం సమీపంలో మర్రిగూడ నుంచి చండూరు వైపు వెళ్తున్న కారు వేగంగా వారిని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన మల్లేశ్, పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చికిత్స కోసం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, మల్లేశ్​అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒక ఎద్దు కూడా చనిపోయింది.  మృతుడి కుమారుడు మద్ది శరత్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాంబాబు తెలిపారు.

ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొని ఒకరు..
సిద్దిపేట రూరల్: రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం నంతసాగర్ వద్ద రాజీవ్ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. చిన్నకోడూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం, బ్రహ్మణకొట్కూర్ కు చెందిన షేక్ మక్బుల్ బాషా(61) తాడిపత్రి నుంచి నాపరాళ్ల లోడ్ తో కాగజ్ నగర్ కు బయలుదేరాడు. అర్ధరాత్రి డ్రైవర్ షేక్ మక్బుల్ బాషాకు నిద్ర రావడంతో పక్కనే ఉన్న రఫీని డ్రైవింగ్ చేయమన్నాడు.

రఫీ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ అనంతసాగర్ వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో లారీలో ఉన్న నలుగురు లారీ ముందు భాగంలో ఇరుక్కుపోయారు. విషయం తెలుసుకున్న ఎస్సై చంద్రమోహన్ సిబ్బందితో అక్కడకు చేరుకుని జేసీబీ సహాయంతో లారీలో నుంచి నలుగురిని బయటకు తీశారు. వెంటనే వారిని 108లో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే షేక్ మక్బుల్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.