అమెజాన్ లోకి ఎట్లొచ్చింది..?..నరవణె అబద్ధం చెబుతున్నారా? లేక పెంగ్వినా:రాహుల్ గాంధీ

అమెజాన్ లోకి ఎట్లొచ్చింది..?..నరవణె అబద్ధం చెబుతున్నారా? లేక పెంగ్వినా:రాహుల్ గాంధీ
  • తనకు ఆర్మీ మాజీ చీఫ్​పై నమ్మకం ఉంది: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: ఆర్మీ మాజీ చీఫ్  ఎంఎం నరవణె రాసిన పుస్తకాన్ని ఇంకా పబ్లిష్ చేయలేదంటూ పెంగ్విన్ పబ్లిషర్స్ కంపెనీ ఇచ్చిన వివరణపై లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. మంగళవారం పార్లమెంటు బయట మీడియాతో ఆయన మాట్లాడారు. నరవణె బుక్ ‘ఫోర్  స్టోరీస్  ఆఫ్  డెస్టినీ’ ని ఇంకా పబ్లిష్  చేయలేదని పెంగ్విన్  హౌస్ చెబుతోంది.. కానీ, ఆ పుస్తకం కాపీలు అమెజాన్ లోకి ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. 

‘‘నరవణె తన పుస్తకానికి సంబంధించిన లింక్ ను అమెజాన్ లో పెట్టారని ట్వీట్  చేశారు. తన పుస్తకం కావాలంటే ఆ లింక్ ను ఫాలో కావాలని ఆయన సూచించారు. మరోవైపు పుస్తకాన్ని ఇంకా ప్రచురించలేదని పెంగ్విన్  చెబుతోంది.  నరవణె అబద్ధం చెబుతున్నారా? లేక పెంగ్వినా? ఆర్మీ మాజీ చీఫ్  అబద్ధం చెప్పరని నేను అనుకుంటున్నా. ఆయనపై నాకు నమ్మకం ఉంది. ఆ బుక్ లో కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నా. 

కానీ, ఆ పుస్తకం మన దేశంలో ఇంకా పబ్లిష్  కాలేదని అధికార పార్టీ నేతలు అంటున్నారు” అని రాహుల్  పేర్కొన్నారు. ఎవరు నిజం చెబుతున్నారో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా బుక్ కాపీని రాహుల్  పట్టుకొని చూపారు. ఆ పుస్తకం అందుబాటులోనే ఉందని యువత తెలుసుకోవాలని ఆయన కోరారు.

 ‘‘బుక్  పబ్లిక్  డొమైన్ లోకి ఇంకా రాలేదని లోక్ సభ స్పీకర్  అంటున్నారు. ప్రభుత్వం, డిఫెన్స్  మినిస్టర్  రాజ్ నాథ్  సింగ్  కూడా అదే మాట చెబుతున్నారు. కానీ, పుస్తకం మార్కెట్ లో ఉందని దేశంలోని ప్రతిఒక్క పౌరుడు కూడా తెలుసుకోవాలి” అని రాహుల్  వ్యాఖ్యానించారు. 2020లో చైనా, భారత్  మధ్య జరిగిన పరిణామాలను వివరిస్తూ నరవణె ఆ పుస్తకంలో రాశారని ఆయన తెలిపారు.