ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నరు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలు  ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నరు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • బీఆర్ఎస్​ నేతలు చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నయ్: మంత్రి పొంగులేటి
  • ఆ ఎక్విప్​మెంట్ ​ఎక్కడెక్కడ అమర్చారో ఆరా తీస్తున్నం
  • విచారణ తర్వాత బాధ్యులపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరిక
  • మున్సిపల్ ఎన్నికల్లో 80 శాతానికిపైగా సీట్లు సాధిస్తమని వెల్లడి

ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో ఇప్పటికీ బీఆర్​ఎస్​ నేతలు ఫోన్ ట్యాపింగ్​కు పాల్పడుతున్నట్టు అనుమానాలున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దీనిపై ప్రభుత్వం సీరియస్​గా ఉందని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఎక్విప్​ మెంట్ ఇంకా బీఆర్​ఎస్​ లీడర్ల వద్ద ఉందని.. వాటిని ఎక్కడెక్కడ అమర్చారో ఆరా తీస్తున్నామని తెలిపారు. ఏయే మామిడి తోటలు, ఫామ్​ హౌస్​ లలో ఇంకా దొంగతనంగా వింటున్నారో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


మంగళవారం ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, జరుగుతోందని అనేక మంది గగ్గోలు పెడుతున్నారు. ఇది అక్షరాలా నిజం. ఇప్పుడు కూడా కొందరు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎంక్వయిరీ చేయిస్తోంది. ఎవరు సూత్రధారులు? ఎక్కడెక్కడ పరికరాలు పెట్టారు? అనేది బయటకు తీస్తం’’అని అన్నారు. ఫోన్​ కాన్ఫరెన్స్​లో ఉద్యోగులను ఓట్లు అడగడంలో తప్పేముందని, తన పార్టీ తరఫున తాను అడిగానని మంత్రి చెప్పారు.

మున్సిపల్ ఎన్నికల్లో80 శాతానికి పైగా సీట్లు కాంగ్రెస్​వే

రాష్ట్రంలో బుధవారం ఎన్నికలు జరగబోయే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో కాంగ్రెస్ భారీ విజయం సాధించబోతోందని మంత్రి పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. రెండేండ్లలో ప్రజలకు చేరువయ్యామని, మున్సిపల్ ఎన్నికల్లో 80 శాతానికి పైగా స్థానాలను గెలుచుకుంటామని పేర్కొన్నారు. ఇది జీర్ణించుకోలేకే ప్రతిపక్ష నాయకులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారని, అసభ్యకర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్​ పాలనకు రెఫరండం అని అప్పటి ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ మాజీ మంత్రులే చెప్పారని, ఆ ఎన్నికల్లోనే ఓటర్లు బీఆర్ఎస్ కు బుద్ధిచెప్పారన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మున్సిపల్ ఎలక్షన్లలోనూ పునరావృతం కాబోతున్నాయని మంత్రి వెల్లడించారు. 

అభివృద్ధికి పెద్ద పీట

రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 8.19 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిందని, తమ ప్రభుత్వం ఆ అప్పులకే నెలకు వడ్డీ రూ.6,300 కోట్లు కడుతూ కూడా సంక్షేమాన్ని ఆపలేదని మంత్రి పొంగులేటి చెప్పారు. మొదటి విడతలో రాష్ట్రంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, ఏప్రిల్ నెలలో రెండో విడత ఇస్తామన్నారు. వరి వేస్తే ఉరి అన్న దొరల కాలం పోయి, ఇప్పుడు సన్న వడ్లకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నామని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. సీపీఐ ఇప్పటికీ తమకు మిత్రపక్షమేనని, కొత్తగూడెం కార్పొరేషన్, ఏదులాపురం మున్సిపాలిటీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉంటుందన్నారు.