రైలు జైలులో 17గంటలు

రైలు జైలులో 17గంటలు
  •  వరదల్లో చిక్కుకున్న మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్
  • 1050 మంది ప్యాసింజర్లను కాపాడిన సైనికులు
  •  బద్లాపూర్ వద్ద నిలిచిపోయిన రైలు
  • 17 గంటలపాటు నీళ్ల మధ్య గడిపిన ప్రయాణికులు
  •  ఏ క్షణం ఏం జరుగుతుందోనని తీవ్ర ఆందోళన
  • సిబ్బందిని అలర్ట్ చేసిన రైల్వే శాఖ

తీవ్ర నీటి కొరతతో అల్లాడుతున్న మహారాష్ర్టలో వానలొస్తున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన జనాలను భారీ వర్షాలు పలకరించాయి. కరువు తీరేలా కురుస్తున్నాయి. ‘‘ఇన్నాళ్లుగా బాకీ పడ్డాను. అప్పు తీర్చేయాలి’’ అన్నట్లుగా దంచికొడుతున్నాయి. దీంతో చాలా చోట్ల వరదలు పోటెత్తాయి. ఈ క్రమంలో 1,050 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న మహాలక్ష్మి ఎక్స్​ప్రెస్ రైలు వరదల్లో చిక్కుకుంది. పట్టాలపైకి నీరు చేరడంతో దాదాపుగా 17 గంటలు ఉన్నచోటే నిలిచిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే రాష్ర్ట ప్రభుత్వం చర్యలకు దిగింది. భద్రతా దళాలు, వివిధ రెస్క్యూ సంస్థల సమన్వయంతో పెను ప్రమాదం నుంచి ప్యాసింజర్లను రక్షించింది. మధ్యాహ్నం 3 గంటలకు రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది.

ఉల్లాస్ నది పోటెత్తడంతో..

శుక్రవారం రాత్రి ముంబై నుంచి కొల్లాపూర్​కు మహాలక్ష్మి ఎక్స్​ప్రెస్ బయలుదేరింది. భారీ వర్షాలకు ఉల్లాస్ నది పోటెత్తింది. దీంతో పట్టాలపైకి వరద నీరు చేరడంతో శనివారం తెల్లవారుజామున థానె జిల్లాలోని బద్లాపూర్ సమీపంలో రైలు నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వం వెంటనే ఎన్డీఆర్ఎఫ్​సహాయం కోరింది. ‘‘ఉల్లాస్ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వరద పోటెత్తింది. ఛమ్​టోలి వద్ద రైలు ఆగిపోయింది. ప్రయాణికులను కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించాం. అలాగే హెలికాప్టర్ సర్వీసులు, నేవీ సహాయాన్ని కోరాం” అని థానె డిప్యూటీ కలెక్టర్ శివాజీ పాటిల్ తెలిపారు. తర్వాత 8 ఎన్డీఆర్ఎఫ్ బోట్లను అక్కడికి తరలించినట్లు అధికారులు చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, నేవీ, ఎయిర్​ఫోర్స్, ఆర్మీ, రైల్వే, మహా ప్రభుత్వ యంత్రాంగం కలిసి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి. రైలులో ఉన్న 1,050 మందికి పైగా ప్రయాణికులను రక్షించాయి. తర్వాత పక్కనే ఉన్న బద్లాపూర్ స్టేషన్​కు తరలించామని, వారిని గమ్యానికి చేర్చేందుకు ప్రత్యేకంగా ఓ రిలీఫ్ రైలును ఏర్పాటు చేశామని సెంట్రల్ రైల్వే సీనియర్ స్పోక్స్ పర్సన్ ఏకే జైన్ చెప్పారు. 19 బోగీలు ఉన్న ప్రత్యేక రైలును కల్యాణ్ స్టేషన్ నుంచి కొల్హాపూర్ కు పంపినట్లు చెప్పారు. అలాగే ప్యాసింజర్లకు ఆహారం, నీళ్లు, వైద్య సాయం అందజేశామన్నారు. ప్రయాణికుల్లో 9 మంది గర్భిణులు, ఒక నెల వయసున్న చిన్నారి ఉన్నారని అధికారులు చెప్పారు. శనివారం తెల్లవారుజాము నుంచి సుమారు 17 గంటలపాటు రైలు అక్కడే ఉందని చెప్పారు.

ముంబైని ముంచెత్తింది..

గత 24 గంటల్లో ముంబైలో వాన దంచికొట్టింది. దెబ్బకు 97.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా శాంతాక్రూజ్‌లో 219 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రోడ్లు జలాశయాలను తలపిస్తున్నాయి. ట్రాఫిక్ స్తంభించిపోయింది. పలు రైళ్లు రద్దయ్యాయి. ఇక ముంబై తూర్పు సబర్బన్​లో 163 మి.మీ, పశ్చిమ సబర్బన్ ప్రాంతాల్లో 132 మి.మీ. వర్షం కురిసింది. సబర్బన్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ముంబై కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ కేఎస్ హొసాలికర్ చెప్పారు. వానలకు 11 విమాన సర్వీసులు శనివారం తాత్కాలికంగా రద్దయ్యాయి. ముంబైకి రావాల్సిన మరో 9 ఫ్లయిట్లను దగ్గర్లోని ఎయిర్​పోర్టులకు దారి మళ్లించారు. సిటీ ఎయిర్​పోర్టులో కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగలేదని చెప్పారు. సముద్ర తీరానికి దూరంగా ఉండాలని, మ్యాన్‌హోల్స్ తెరవద్దని బీఎంసీ అధికారులు సూచించారు.

‘మహా’ వానలు

ఒక్క ముంబైలోనే కాదు.. మహారాష్ర్టవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరుసగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నాసిక్ సిటీ, జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలకు నీళ్లు పోటెత్తాయి. గత 24 గంటల్లో జిల్లాలోని ఇగాత్​పురిలో 212 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది. త్రయంబకేశ్వర్​లో 140 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో నాసిక్​ ప్రధాన జల వనరు అయిన గంగాపూర్ డ్యాం 63 శాతం నిండింది. అలాగే దర్నా డ్యాం 83 శాతం నిండింది. జిల్లాలోని 22 రిజర్వాయర్లలో నీటి నిల్వలు భారీ పెరిగాయి.

థానె సిటీలో 160 మి.మీ వర్షం కురిసింది. జిల్లాలోని ముర్బాద్​లో 332 మి.మీ వర్షపాతం నమోదైంది. కల్యాణ్, ఉల్లాస్ నగర్, అంబర్​నాథ్ ప్రాంతాల్లో 200 మి.మీ. కన్నా ఎక్కువగా వర్షం కురిసింది.రత్నగిరి జిల్లాలోని జగ్బుడి నది ఉప్పొంగడంతో ముంబై-గోవా నేషనల్ హైవేపై ప్రభావం పడింది. జిల్లాలోని ఖేడ్​లో హైవే పైకి వరద నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.

రాయ్​గఢ్​జిల్లాలోని అంబ, సావిత్రి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో నాగొథానె, ఖొపోలి–పాలి రోడ్లపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడికి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందిని పంపినట్లు అధికారులు చెప్పారు.

థాణెలో 100 మంది చిక్కుకున్నరు

థానె జిల్లాలో కురుస్తున్న అతి భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో 100 మందికిపైగా చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు ఎయిర్​ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. బద్లాపూర్​పట్టణంలో ఉన్న ఓ పెట్రోల్​పంప్ టెర్రస్​పైన 70 మంది వరకు చిక్కుకున్నారని డిజాస్టర్ కంట్రోల్ రూం అధికారులు చెప్పారు. షహాద్​లోని ప్రైవేట్ రిసార్టులో 45 మంది వరకు జల దిగ్బంధంలో ఉన్నట్లు చెప్పారు. వీరందరినీ హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎయిర్​ఫోర్స్ ఆపరేషన్ చేపట్టింది. ఎన్డీఆర్ఎఫ్, లోకల్ పోలీసులు, అగ్నిమాపక శాఖ, డిజాస్టర్ మేనేజ్​మెంట్​ఫోర్స్ తదితర సంస్థల అధికారులు, సిబ్బంది సాయం చేస్తున్నారు.

పక్కాగా.. పూర్తి సమన్వయంతో

కేంద్రం, మహారాష్ర్ట ప్రభుత్వం, రైల్వే వెంటనే స్పందించడంతోనే పెను ప్రమాదం తప్పింది. అన్ని వైపుల నుంచి పక్కాగా, పూర్తి సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ నడిచింది. రాష్ర్ట ప్రభుత్వం అడగడం.. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగడంతో సగం పని పూర్తయింది. ఫ్లడ్ రిలీఫ్ ఐటమ్స్, స్పెషలిస్టు డైవర్లతో కూడిన 200 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. వీరికి తోడుగా ఏడు నేవీ బృందాలు, రెండు ఎయిర్​ఫోర్స్ హెలికాప్టర్లు, రెండు మిలటరీ బృందాలు, స్థానిక అధికార యంత్రాంగం రంగంలోకి దిగాయి. అలాగే 37 మంది డాక్టర్లు, గైనకాలజిస్టులతో కొన్ని ఆంబులెన్సులను ప్రభుత్వం సిద్ధం చేసింది. 14 బస్సులు, టెంపోలను అందుబాటులో ఉంచింది. సహాయక బృందాలు వచ్చే వరకు రైలు నుంచి ఎవరూ కిందికి దిగొద్దని ప్యాసింజర్లకు సెంట్రల్ రైల్వే సూచనలు చేయడం కూడా మంచిదైంది. ప్రయాణికులు ఆందోళనకు గురై రైలు దిగి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేది. ‘‘రైలులో ఉండటమే మీకు మంచిది. రైలులోని సిబ్బంది, ఆర్పీఎఫ్ పోలీసులు, సిటీ పోలీసులు మీకు అవసరమైన సాయం చేస్తారు. ఎన్డీఆర్ఎఫ్ నుంచి సమాచారం వచ్చే వరకు ఆగండి” అని చెప్పింది. వరద నీరు పెరుగుతున్న నేపథ్యంలో ఆపరేషన్ ఆలస్యమై ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేది.

రాజస్థాన్​లోనూ భారీ వానలు

రాజస్థాన్​లోనూ భారీ వానలు కురుస్తున్నాయి. దీంతో సికర్ జిల్లాలో గురువారం నుంచి శనివారం వరకు ఐదుగురు చనిపోయారు. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలు గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత 24 గంటల్లో టోంక్ జిల్లా వనస్థలిలో 100 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జైపూర్​లో 84 మి.మీ., అజ్మీర్​లో 64 మి.మీ. కోటాలో 63 మి.మీ. కురిసింది.

కంగ్రాట్స్‌ రెస్క్యూ టీమ్స్

రెస్క్యూ ఆపరేషన్​ను దగ్గరుండి పర్యవేక్షించాం. భద్రతా దళాలు, వివిధ సంస్థలు కలిసి.. మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ నిర్వహించి ప్యాసింజర్లను కాపాడాయి. ‘కుడోస్ టు ది రెస్క్యూ టీమ్స్’. వారి ప్రయత్నాలు సూపర్.

 – కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్