గుజరాత్ బ్రిడ్జి ఘటన.. సిట్ రిపోర్ట్ లో సంచలన విషయాలు

గుజరాత్ బ్రిడ్జి ఘటన.. సిట్ రిపోర్ట్ లో సంచలన విషయాలు

గుజరాత్ లో మోర్బి బ్రిడ్జి కూలి 135 మంది మరణించిన  ఘటనలో  సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.  బ్రిడ్జి కూలడానికి ముందే   22  వైర్లు తుప్పబట్టాయని.. పాత సస్పెండర్లును కొత్తవాటితో వెల్డింగ్ చేయడం వంటి తప్పిదాలే ఈ ప్రమాదానికి కారణమని సిట్ తన నివేదికలో పేర్కొంది. బ్రిడ్జి మరమ్మతులు, నిర్వహణలో లోపాలున్నట్లు గుర్తించింది. ఈ నివేదికను రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఇటీవల మోర్బీ మున్సిపాలిటీకి అందించింది. గుజరాత్ ప్రభుత్వం నియమించిన ఈ  సిట్ లో  ఐఏఎస్ అధికారి రాజ్‌కుమార్ బేనివాల్, ఐపీఎస్ అధికారి సుభాష్ త్రివేది, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి, చీఫ్ ఇంజనీర్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్  సభ్యులుగా ఉన్నారు. 

1887 లో మచ్చు నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జిలో రెండు ప్రధాన కేబుల్ వైర్లు ఉన్నాయి. గతేడాది అక్టోబర్ 30న బ్రిడ్జి కూలడానికి ముందే ఆ రెండు కేబుల్స్ లోని ఒక కేబుల్ తుప్పు పట్టి అందులోని సగానికి  పైగా వైర్లు తెగిపోయాయి..మిగితావి ప్రమాద సమయంలో ధ్వంసమయి ఉండొచ్చని సిట్ గుర్తించింది. బ్రిడ్జి మరమ్మతుల్లో భాగంగా పాత సస్పెండర్లను కొత్త వాటితో వెల్డింగ్ చేయడం కూడా ఈ ప్రమాదానికి కారణం అయి ఉండొచ్చని సిట్ తెలిపింది.   ప్రమాద సమయంలో  బ్రిడ్జిపై దాదాపు 300 మంది ఉన్నారని..ఇది బ్రిడ్జి సామర్థ్యం కంటే ఎక్కువని సిట్ వెల్లడించింది. 

బ్రిడ్జి మరమ్మతులను  మోర్బి మునిసిపాలిటీ.. జనరల్ బోర్డు ఆమోదం లేకుండా బ్రిడ్జి నిర్వహణ  కాంట్రాక్టును ఒరెవా గ్రూప్ (అజంతా మాన్యుఫ్యాక్చరింగ్ లిమిటెడ్)కు అప్పగించింది. పునర్నిర్మాణం కోసం అనుమతి లేకుండానే  2022  మార్చి నుంచి అక్టోబర్ 26వ తేదీ వరకు ఈ బ్రిడ్జిని మూసేసింది.  ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు ఒరెవా గ్రూప్ ఎండీ జయసుఖ్ పటేల్ సహా 10 మందిని అరెస్ట్ చేశారు.